వ‌ర్క్‌ఫ్రంహోం పై టెక్కీల బాధ మీకు అర్థ‌మ‌వుతోందా?

వ‌ర్క్ ఫ్రం హోం… గ‌తంలో టెక్కీల‌కు మాత్ర‌మే ఉన్న సౌల‌భ్యం కాగా క‌రోనా పుణ్య‌మా అని ఉద్యోగాలు చేసే అంద‌రికీ అది దాదాపుగా భాగ‌మైపోయింది. అప్పటిదాకా ఆఫీస్ ల‌కు వెళ్లి విసిగిపోయిన వాళ్లకు మొదట్లో ఇది బాగానే ఉంది. ప‌నితో పాటు ఫ్యామిలీకి టైం కేటాయించొచ్చని సంబరపడ్డారు. ఇప్పుడు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్.. అంటే వామ్మో అంటున్నారు. టార్చ‌ర్ అయింద‌ని వాపోతున్నారు. ముఖ్యంగా టెక్కీలైతే త‌మ బాధ చెప్ప‌న‌ల‌వి కాదంటున్నారు.

జ‌నతా కర్ఫ్యూ తర్వాత దాదాపు అన్ని కంపెనీలు ఇంటి నుంచే ఉద్యోగుల‌తో పని చేయిస్తున్నాయి. ఈ ర‌క‌మైన ప‌ని విధానంలో కొత్త స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని పేర్కొంటున్నారు. మార్నింగ్ లాగిన్ అయితే రాత్రి దాకా మీటింగ్స్, క్లైంట్స్ కాల్స్ తోనే సరిపోతోంది. ఆఫీస్ టైమింగ్స్ కి మించి రెండు, మూడు గంటలు ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ లలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లు రావడం, పిల్లలు అల్లరి చేయడం వల్ల మేనేజ్మెం ట్ నుంచి చీవాట్లు తింటున్న వాళ్లూ చాలామందే ఉన్నారట‌.

ఆఫీసులో అయితే పని చేసే వాతావరణం, కొలిగ్స్ ఉంటారు. రిలాక్స్ అయ్యేందుకు టైమ్ దొరుకుతుంది. ఇంట్లో ఆ పరిస్ థితి ఉండదు. ఆఫీసులో ప‌ని మధ్యలో బ్రేక్ ఉండడం వల్ల కాస్త రిలాక్స్ అయ్యే వారు. ఇప్పుడు ఇంట్లో గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చుని పని చేస్తుండడంతో విసుగెత్తున్నారు. బ్యాక్ పెయిన్, కంటి సమస్యలతోనూ బాధపడుతున్నారు.

డైలీ 7–8 గంటలు వర్క్ చేస్తున్నా కొన్ని కంపెనీలు వీక్ ఆఫ్, లీవ్ లు కూడా ఇవ్వడం లేదు. శని, ఆదివారాల్లోనూ ఆఫీస్ వర్క్ తోనే చాలామంది గడిపేస్తున్నారట‌. స్థూలంగా ఆఫీస్ తో పోలిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 50% నుంచి 80% ప్రెజర్ పెరిగిందని ఉద్యోగులు అంటున్నారు.

ప్రాజెక్స్ట్ డెడ్ లైన్స్, ప్రొఫెషనల్ మీటింగ్స్, కైంట్స్ కాల్స్ తో తీరిక ఉండటం లేదని, మెంటల్ ప్రెజర్ పెరిగిపోతుందని వాపోతున్నా రు. ఆ స్ట్రెస్ ని ఇంట్లో వాళ్ల మీద, పిల్లల మీద తెలియకుండానే చూపిస్తున్నామంటూ బాధ పడుతున్నారు. ఇన్ని నెలల గ్యాప్ వల్ల కొలిగ్స్ తోనూ కమ్యూని కేషన్ మెయింటెన్ చేయలేకపోతున్నామని, ఆ టైం కూడా ఉండటం లేదని పలువురు చెప్తున్నారు. ఇంట్లో వాళ్లకి కూడా టైం ఇవ్వలేకపోతున్నామ‌ని వాపోతున్నారు. హాలీడేస్ అన్నవే మర్చి పోయామని, వర్క్ మధ్యలో బ్రేక్ కూడా దొరకడం లేదని చెప్తున్నారు.