దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన లైన్ పాక్షికంగా తుప్పుపట్టి ఉందని నిర్ధారణ అయ్యింది. అయితే.. చేతిరాతతో కూడిన ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇట్టే బహిర్గతం చేసి.. ఆ వెంటనే దాచేయడం విస్మయానికి గురి చేస్తోంది.
నివేదికలో ఏం చెప్పారంటే..
- హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి పొరపాటున సిగ్నల్ రావడంతో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో బాలాసోర్‌లోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో లూప్ లైన్‌లోకి ప్రవేశించింది.
- అయితే.. ఈ సిగ్నల్ పొరపాటును గమనించి ఆ వెనువెంటనే సిగ్నల్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పటికే ట్రైన్ లూప్ లైన్‌లోకి కోరమండల్ ప్రవేశించింది. ఫలితంగా అదే లైన్‌లో ఆగివున్న గూడ్స్ రైలుని కోరమండల్ వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రత ధాటికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 కోచ్‌లు విడిపోయి పక్క లైన్‌లో పడ్డాయి.
- సరిగ్గా ఇదేసమయంలో ఈ లైన్‌లో వెళ్తున్న బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్న కోచ్‌లను బలంగా ఢీకొట్టింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణమైనట్టు నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని దర్యాప్తు చేపట్టిన సీనియర్ అధికారులు నిర్ధారించారు.
- ఈ మేరకు జేఎన్ సుబుదీ, ఆర్‌కే బెనర్జీ, ఆర్‌కే పంజిరా, ఏకే మోహంతులతో కూడిన నలుగురు సభ్యుల బృందం చేతి రాతతో 4 పేజీల రిపోర్టును రైల్వేకి సమర్పించింది. బహనగర్ బజార్ రైల్వే స్టేషన్‌లోని సిగ్నల్ రూమ్ రికార్డులు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని వివరించింది.
- ఇక రెండు రైళ్లలోనూ స్లీపర్ కోచ్‌ల కంటే ఏసీ కోచ్‌లపై ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని రిపోర్ట్ తేల్చింది. మరోవైపు ఇంతటి ఘోరం నేపథ్యంలో ఈ లైన్‌లో రక్షణ కవచ్ ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.