దేశంలో వైద్య విద్య చదవాలని అనుకుంటున్న విద్యార్ధుల్లో అత్యధికులు విదేశాలకు క్యూ కడుతున్నారు. దేశవ్యాప్తంగా నీట్, ఎంసెట్ తదితర ఎంట్రన్స్ పరీక్షల్లో వైద్య విద్య చదవటానికి ఉత్తీర్ణులవుతున్న విద్యార్ధులకు సరిపడా మెడికల్ సీట్లు లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. ఈ కారణంతోనే ప్రతి సంవత్సరం వేలాదిమంది విద్యార్ధులు ఫారిన్ వెళ్ళి చదువుతున్నారు. దేశవ్యాప్తంగా మొన్నటి ఎంట్రన్స్ పరీక్షల్లో 5 లక్షలమంది వైద్య విద్య చదివేందుకు అర్హత సాధిస్తే ఉన్న సీట్లు కేవలం 1.25 లక్షలు మాత్రమే.
అర్హత సాధించిన విద్యార్ధులు చదువుకునేందుకు సరిపడా సీట్లు లేకపోతే మరి ఆ విద్యార్ధులంతా ఏమిచేస్తారు ? అందుకనే అవకాశం ఉన్న వాళ్ళంతా విదేశీబాట పడుతున్నారు. దేశంనుండి ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాల నుండి మెడిసిన్ చదివేందుకు ఫిలిప్పీన్స్ రష్యా, ఉక్రెయిన్, కజకిస్ధాన్, కిర్కిస్ధాన్, జార్జియా, యూకే, అమెరికా దేశాలకు వెళుతున్నారు. వీరిలో అమెరికాలో వైద్య విద్యను చదివే వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.
ఎందుకంటే అమెరికాలో వైద్యవిద్య అత్యంత ఖరీదైనది కాబట్టి ఆదేశంలో చదివే బదులు అదేదో మనదేశంలోనే చదువుకోవచ్చు. కాకపోతే విదేశాల్లో చదువుకోవాలని ఆశపడేవాళ్ళు, అందుకు తగ్గట్లుగా స్తోమతున్న వారు మాత్రమే అమెరికాలో మెడిసిన్ చదువుతారు. మిగిలిన వారంతా ఇతర దేశాలకే వెళిపోతున్నారు. మనదేశం నుండి సగటున ప్రతిఏడాది 25 వేలమంది మెడిసిన్ చదవటానికి విదేశాలకు వెళుతున్నారు.
వీరిలో ఏపీకి చెందిన వారిసంఖ్య సుమారు 3500 ఉంటున్నదంటేనే మన రాష్ట్రంలో కూడా ఎంత డిమాండ్ ఉందో అర్ధమైపోతోంది. ఈమధ్యనే నిర్వహించిన నీట్ పరీక్షలో మన రాష్ట్రానికి చెందిన 40 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎంబీబీఎస్, డెంటల్, అగ్రికల్చర్, వెటర్నరీ సీట్లు ఏడువేలు మాత్రమే ఉన్నాయి. మరి మిగిలిన 33 వేల మంది చదవలేకపోతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో మెడిసిన్ చదవాలంటే ఐదున్నరేళ్ళ కోర్సుకు సుమారు రు. 1.5 కోట్లవుతోంది. ఇంత ఖర్చు పెట్టుకునేకంటే విదేశాల్లో రు. 30 లేదా రు. 40 లక్షలతోనే మెడిసిన్ చదవచ్చు కాబట్టే ఫారెన్ కు వెళిపోతున్నారు. మెడిసిన్ కు దేశంలో ఇంత డిమాండ్ ఉన్నా కేంద్రప్రభుత్వం సీట్లు ఎందుకు పెంచటం లేదో అర్థం కావటం లేదు.