90 నిమిషాల వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్ రెడీ!

సోషల్ మీడియా ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పైనే ఎక్కువ సమయం గడిపేలా చేసేందుకు సంస్థలు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీలో ఇన్‌స్టాగ్రామ్ మరో అడుగు ముందుకేసి ఏకంగా 90 నిమిషాల నిడివి ఉన్న లాంగ్ వీడియోలకు అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రీల్స్, షార్ట్ వీడియోలతో ఆకట్టుకున్న ఈ ప్లాట్‌ఫామ్ తాజా నిర్ణయంతో నేరుగా యూట్యూబ్‌కు పోటీ ఇవ్వబోతుందనే చర్చ మొదలైంది.

ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇప్పటివరకు చిన్న వీడియోలు, ట్రెండింగ్ పాటలు, ఫ్యాషన్, వంటల వంటివే గుర్తొస్తాయి. అయితే కొన్ని విషయాలను వివరంగా చెప్పడానికి ఈ చిన్న వీడియోలు సరిపోకపోవడంతో, క్రియేటర్ల సౌలభ్యం కోసం పూర్తిస్థాయి సుదీర్ఘ వీడియోలపై ఇన్‌స్టాగ్రామ్ దృష్టి పెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా క్రియేటర్లు 90 నిమిషాల వరకు వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణ రీల్స్‌లా కాకుండా ల్యాండ్‌స్కేప్ ఫార్మాట్‌లోనూ వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. దీంతో ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు, ట్రావెల్ వ్లాగ్స్, విద్యా సంబంధిత కంటెంట్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే అందించవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ కోసం యూట్యూబ్‌ను ఆశ్రయించే వారికి ఇదొక ప్రత్యామ్నాయంగా మారనుంది.

ఈ ఫీచర్‌లో క్రియేటర్లకు ఉపయోగపడే మరో ముఖ్యమైన సదుపాయం కూడా ఉంది. సుదీర్ఘ వీడియోలోని ఆసక్తికరమైన సన్నివేశాలను చిన్న క్లిప్‌లుగా మార్చి రీల్స్ రూపంలో పోస్ట్ చేయవచ్చు. ఆ రీల్ చూసిన ప్రేక్షకులు పూర్తి వీడియోను కూడా వీక్షించేలా లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల చిన్న వీడియోతో ప్రేక్షకులను ఆకర్షించి, పూర్తి కంటెంట్ వైపు తీసుకెళ్లడం సులువవుతుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు సమాచారం.

సుదీర్ఘ వీడియోల విషయంలో యూట్యూబ్‌కు ఇప్పటికే బలమైన స్థానం ఉంది. క్రియేటర్లకు ఆదాయం పొందే అవకాశాలు, ప్రత్యేక ప్రేక్షకుల వర్గం ఆ ప్లాట్‌ఫామ్‌కు ప్రధాన బలం. గతంలో ఐజీటీవీ పేరుతో లాంగ్ వీడియోలపై ప్రయోగం చేసిన ఇన్‌స్టాగ్రామ్‌కు ఆశించిన విజయం దక్కలేదు. అయినప్పటికీ ఇప్పుడు కొత్త వ్యూహంతో వస్తున్న ఈ ఫీచర్ క్రియేటర్లకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, యూట్యూబ్ ఆధిపత్వానికి ఇది నిజంగానే సవాల్ విసురుతుందా అనేది సాధారణ యూజర్లకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తేనే స్పష్టమవుతుంది.