అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న గోపికపై ఆమెకు అన్న వరుస అయ్యే హేమంత్ ఉన్మాదిగా మారి దారుణానికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రాతి తీవ్రంగా గాయపడిన గోపిక ప్రాణాలు క్షేమంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. తాజాగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమెకు స్పృహ కూడా వచ్చిందని.. ఒక్కొక్క పదం చొప్పున మాట్లాడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోపిక ఆరోగ్యంపై బులిటిన్ విడుదల చేశారు.
ఉన్మాది హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో గోపికపై దాడి చేసిన ఘటన తర్వాత ఆమెకు మెరుగైన వైద్యం కోసం.. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. శస్త్రచికిత్స.. అనంతరం గోపిక నుంచి వెంటిలేటర్ తొలగించినట్టు వైద్యులు పేర్కొన్నారు. వైద్యుల పిలుపునకు స్పందిస్తూ.. ఒక్కో పదంతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. అదేసమయంలో పీఐసీయూలో హైఫ్లో ఆక్సిజన్ సాయాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. గోపిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడించారు.
నిన్నటి వరకు ముక్కు ద్వారా అందిస్తున్న ఆహారాన్ని ప్రస్తుతం నోటి ద్వారా కొంచెం కొంచెంగా సజావుగా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అయితే.. రక్తహీనత కారణంగా గోపికకు రక్తమార్పిడి చేసినట్టు వివరించారు. అవయవాల కదలికలు కూడా సాధారణంగా ఉన్నాయని తెలిపారు. ఛాతీ బాగా దెబ్బతిందని వ్యాయామాల కోసం ఫిజియోథెరపీని నియమించామని తెలిపారు. యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులతో పాటు ఇతర సహాయక చికిత్సలు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. గోపిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వైద్య బృందం పేర్కొంది.
కాగా.. స్పృహలోకి వచ్చిన గోపిక.. కన్నీరుమున్నీరు అయినట్టు వైద్యులు తెలిపారు. తన జీవితం నాశనం అయిపోయిందని ఆమె విలపించారని ఆమె ఓదార్చడం తమ వల్లకాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. ఘటన కారణంగా ఏర్పడిన భయం.. తాలూకు ఛాయలు ఉన్నాయని.. వాటిని తొలగించేందుకు మానసిక వైద్యుల సాయం అవసరం అవుతుందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో కోలుకునేందుకు నెల రోజుల సమయం పట్టవచ్చని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో తమకు సహకరిస్తోందని వైద్యులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates