స్వీట్ బాక్స్ అడిగిన పాపానికి..

వీరమణి.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మంచు విష్ణు సైతం ఈ పేరు వాడి ఒక ట్వీట్ వేశాడు తాజాగా. ‘‘వీరమణి అన్నా.. నీతో ప్రేమలో పడిపోయా. వీరమణి అన్నా.. నీకు స్వీట్స్ పంపాలి. ఏ అడ్రస్‌కు పంపమంటారు’’ అని మంచు విష్ణు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అసలీ వీరమణి ఎవరు.. ఈ స్వీట్స్ కథేంటి అని ఆశ్యర్యం కలుగుతోందా? తెలుసుకుందాం పదండి.

తమిళనాడుకు చెందిన వీరమణి అనే వ్యక్తి.. ఈ మధ్య తనకు ఎవరైనా స్వీట్ బాక్స్ పంపాలని సరదాగా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాడు. తన అడ్రస్ కూడా ఇచ్చాడు. ఐతే కొందరు సానుకూలంగా స్పందించి అతడికి స్వీట్స్ పంపారు. కానీ ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ వ్యవహారం అనూహ్యమైన మలుపు తిరిగింది.

వీరమణి అడ్రస్‌కు క్యాష్ ఆన్ డెలివరీ మీద పెద్ద పెద్ద ఐటెమ్స్ పంపడం మొదలుపెట్టారు నెటిజన్లు. భారీ ధర ఉన్న టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్‌లు.. ఇలా ఏ ఐటెం పడితే ఆ ఐటెం పంపడం మొదలుపెట్టారు. తన ఇంటికి సీఓడీ మీద వచ్చిన టీవీలాంటి పెద్ద ఐటెమ్స్ చూపిస్తూ లబోదిబోమన్నాడు వీరమణి. ఎంత వరకు నిజమో కానీ.. 70 కోట్ల రూపాయల విలువైన వార్ ట్యాంక్‌ను కూడా వీరమణి ఇంటికి ఆర్డర్ పెట్టినట్లు ఒక ప్రచారం జరుగుతోంది.

ఈ ఆర్డర్లను వీరమణి తీసుకోకుండా తిరస్కరిస్తుండడంతో డెలివరీ బాయ్‌లతో అతడికి గొడవలు జరిగాయి. సోషల్ మీడియా జనాలు తనను ఇలా ఆడుకుంటున్నారని.. వీళ్ల దెబ్బకు తాను ఇంటిని కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతూ.. తట్టాబుట్టా సర్దుకుని ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోతున్న వీడియోను కూడా వీరమణి పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు కొందరికి మంచి వినోదంగా మారగా.. కొందరేమో పాపం అని వీరమణి మీద జాలి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు కూడా స్పందించి ఇలా పోస్టు పెట్టాడు.