సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్ నుంచి తీసేశారని ప్రేక్షకులు ఏకంగా ధర్నాకు దిగడం చాలా అరుదు. ఇప్పుడు రవితేజ ఇరుముడి విషయంలో తెలంగాణలో అలాంటి సీనే కనిపించింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ ముందు ప్రేక్షకులు బైఠాయించి ఇరుముడిని మళ్లీ వేయాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. గత ఐదు రోజులుగా ఈ థియేటర్‌లో ఇరుముడి ప్రదర్శిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు సినిమా కోసం వస్తున్నారట. గత మూడు నాలుగు రోజులుగా టికెట్లు దొరకక కొందరు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని అక్కడికి వచ్చిన వారు చెబుతున్నారు. మంగళవారం రాత్రి కూడా ఇదే పరిస్థితి ఉందని వారి మాట.
అయితే బుధవారం టాక్సిక్ రిలీజ్ కావడంతో ఇరుముడిని తీసేసి యశ్ సినిమాకు షోలు కేటాయించారు. దీంతో ఉదయం థియేటర్ దగ్గరకు వచ్చిన వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుముడికే ఇంకా ప్రేక్షకులు వస్తుంటే ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తూ అక్కడే కూర్చున్నారు. అవసరమైతే కింద కూర్చొని అయినా సినిమా చూస్తామని కొందరు చెప్పడం ఈ ఘటనలో మరింత హైలైట్ అయింది.
నిజానికి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పటికే ఆడుతున్న సినిమాల షోలు తగ్గడం కొత్త విషయం కాదు. ఓపెనింగ్ డిమాండ్‌ను బట్టి థియేటర్లు కొత్త సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఇరుముడికి డిమాండ్ ఇంకా ఉందని ప్రేక్షకులే థియేటర్ ముందు కూర్చొని చెప్పడం వెరైటీగా మారింది. టాక్సిక్ కోసం ఇరుముడి స్క్రీన్స్ తగ్గుతాయా అనే లెక్క రిలీజ్‌కు ముందే ఉంది. కానీ మక్తల్‌లో మాత్రం అది డైరెక్ట్ గా ప్రేక్షకుల దగ్గర నుంచి రియాక్షన్ తీసుకొచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates