ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతల బాటలోనే కొనసాగుతున్నాయి. ఇటీవల మెటా వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్ కూడా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ వచ్చే వారం కొత్త రౌండ్ లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కంపెనీలో మొత్తం సిబ్బందిలో రెండు శాతం కంటే తక్కువ మందిపై ప్రభావం పడినా.. ఉద్యోగుల సంఖ్యను బట్టి చూస్తే దాదాపు ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
మరోవైపు టిక్‌టాక్ కూడా ఉద్యోగుల కోతకు సిద్ధమైంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న యూరోపియన్ కార్యాలయంలో సుమారు 300 మందిని తొలగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఖర్చులను తగ్గించడం, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది.
ఒకప్పుడు ఉద్యోగాల కలగా భావించిన టెక్ కంపెనీల్లో ఇప్పుడు లేఆఫ్స్ సాధారణ విషయంగా మారిపోయాయి. ప్రతి నెలా ఏదో ఒక దిగ్గజ సంస్థ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించే సూచనలు కూడా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates