టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడికి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ ఉండేందుకు పర్మిషన్ లేదు. జట్టులో ఒక ముఖ్యమైన సభ్యుడే అయినప్పటికీ ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెట్టిన కఠినమైన వయసు నిబంధనల వల్ల ఈ ఆంక్షలు విధించారు. దీనివల్ల స్టేడియంలో వైభవ్‌కు కేవలం అతని కోసం ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించనున్నారు.
నిబంధనల ప్రకారం పదహారేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు బట్టలు మార్చుకోవడానికి కచ్చితంగా వేరే గదిని వాడాలి. అందుకే మ్యాచ్‌కు ముందు, ఆట పూర్తయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకునే సమయంలో వైభవ్ ప్రధాన టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడానికి వీల్లేదు. కేవలం మ్యాచ్ జరుగుతున్న సమయంలో, టీమ్ మీటింగ్స్ జరిగేటప్పుడు మాత్రమే తోటి సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చునేందుకు అతనికి అవకాశం ఇచ్చారు. మిగతా సమయాల్లో అతనికి ఇచ్చిన ఆ స్పెషల్ రూమ్ లోనే ఉండాలి.
ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్ లో రెండు టీ20లు ముగిశాక భారత జట్టు నేరుగా ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్తుంది. అక్కడ డర్హామ్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ లాంటి కీలక గ్రౌండ్లలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ప్రతి స్టేడియంలోనూ వైభవ్ కోసం ప్రత్యేకంగా ఒక డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేసేలా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ సమన్వయంతో పని చేస్తున్నాయి. కొత్త వాతావరణంలో ఈ కుర్రాడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, అతనికి ధైర్యం చెప్పేందుకు అతని పేరెంట్స్ కూడా లండన్ కు తోడుగా వెళ్లారు.
నిజానికి స్వదేశంలో వయసుతో సంబంధం లేకుండా జట్టులోని ఆటగాళ్లంతా ఒకే డ్రెస్సింగ్ రూమ్ వాడుకోవచ్చు. కానీ ఇంగ్లాండ్ క్రీడల్లో ఇలాంటి సేఫ్టీ రూల్స్ చాలా కామన్ గా ఉంటాయి. ఇక ఈ టూర్‌లో వైభవ్ అడుగుపెడితే ఒక సంచలన రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరుతోనే టీమిండియా యంగెస్ట్ క్రికెటర్ రికార్డు ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్ ఆడితే కేవలం 15 ఏళ్ల 91 రోజులకే ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates