ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక 2027 సీజన్ నుంచి మెంటార్‌గా కొనసాగనున్నాడు. అయితే ధోనీ రిటైర్మెంట్తో CSK లో పెద్ద మార్పులేమీ అవసరం లేదనుకుంటే పొరపాటే. ఎందుకంటే గత మూడు సీజన్లలో చెన్నై ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. ఇప్పటికే వికెట్ కీపింగ్ బాధ్యతలు సంజూ శాంసన్ తీసుకున్నా, కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
నిజానికి ధోనీ లేకుండా ఆడటం సీఎస్కేకు కొత్తేమీ కాదు. గాయం కారణంగా 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ సమయంలో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. అంతేకాదు.. జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో వికెట్ కీపర్ స్థానంలో సమస్య పెద్దగా లేదు. అయితే చివరి ఓవర్లలో ధోనీ పోషించిన ఫినిషర్ పాత్రను ఎవరు తీసుకుంటారనేది చూడాలి. శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్ వంటి హిట్టర్లు ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించే బ్యాటర్ అవసరం ఉంది.
మరోవైపు కెప్టెన్సీ విషయంలో చెన్నై యాజమాన్యం నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తున్నాడు. కానీ 2026లో అతడి బ్యాటింగ్ పై విమర్శలు వచ్చాయి. దీంతో సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ అప్పగించాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన అనుభవం సంజూకు ఉంది. అయితే రుతురాజ్‌ను కొనసాగించాలా, నాయకత్వంలో మార్పు చేయాలా అనేది సీఎస్కే యాజమాన్యం తేల్చుకోవాల్సి ఉంది.
ఇక బౌలింగ్‌లోనూ చెన్నై కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్ ఉన్నా, పేస్ విభాగంలో మరింత బలం అవసరం. ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీసే బౌలర్‌తో పాటు చివరి ఓవర్లలో పరుగులను నియంత్రించగల పేసర్ ఉంటే జట్టుకు ఉపయోగపడుతుంది. మరోవైపు 2027 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నవంబర్ 17 సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. డిసెంబర్లో జరిగే వేలంలో చెన్నై ఏ స్థానాలకు ప్రాధాన్యం ఇస్తుందనేది కీలకం. ధోనీ మెంటార్‌గా ఉండటంతో జట్టు సెలక్షన్, యువ ఆటగాళ్లను సిద్ధం చేసే విషయంలో అతడి అనుభవాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates