రోడ్డు పక్కన నిలబడి ఆకర్షిస్తే.. ఏం జరుగుతుంది?

శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త సందేహాలు కొందరికి రావొచ్చు. తమ సంభాషణల్లోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో సాగుతున్న చర్చ నేపథ్యంలో చట్టం చెప్పేది? సుప్రీం కోర్టు చెప్పింది? ఏమిటి? అన్న అంశంతో పాటు.. సమ్మతితో వయోజనులు చేసే వేశ్యవృత్తి చేస్తుంటే వేధింపులు వద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

అయితే.. ఇందులో చాలానే పరిమితులు ఉన్నాయి. ఆ విషయాన్ని వదిలేసి.. కొందరు తప్పుగా విషయాన్ని అర్థం చేసుకోవటంతో పాటు.. తప్పుడు సమాచారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి ట్రాప్ లో పడొద్దన్నదే మా ఉద్దేశం.

అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది? అదే సమయంలో అందులో ఉండే పరిమితుల లోతుల్లోకి వెళ్లకుండా.. విషయాల్ని పైపైన చదివి.. తమకు కలిగిన అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దటం కూడా తప్పే అవుతుంది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ఎవరైనా వయోజన మహిళ సమ్మతితో తనకు తానుగా రోడ్డు మీద నిలబడి ఎవరినైనా ఆకర్షించే ప్రయత్నం చేస్తే.. ఎలాంటి చర్యలు ఉండవా? అన్నది ఒక ప్రశ్న.

దీనికి చట్టపరంగా చూస్తే.. అలాంటి మినహాయింపులు ఏమీ సుప్రీంకోర్టు ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఒక వయోజన మహిళ రోడ్డు మీద నిలబడి ఎవరినైనా ఆకర్షించే ప్రయత్నం చేయటం చట్టప్రకారం నేరమే. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకునే వీలుంది. ఇందులో చట్టపరమైన తేడాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో వేశ్యావృత్తికి సంబంధించి ‘ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్’ ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక మహిల తన ప్రైవేటు స్థలంలో లేదంటే పూర్తిగా తన స్వచ్ఛంద సమ్మతితో ఈ వృత్తిని నిర్వహించటం నేరం కాదు. అదే సమయంలో కొందరు వయోజనుల ఇష్టంతో కలిసి ఒక వ్యాపారంగా చేయటం చట్టప్రకారం తీవ్రమైన నేరం.

చట్టప్రకారం చూస్తే ఎవరైనా వ్యక్తి బహిరంగ ప్రదేశంలో కానీ రోడ్డు మీద నిలబడి.. సైగల ద్వారా కానీ మాటలతో ఆకర్షించే ప్రయత్నం చేయటం శిక్షార్షమైన నేరం. ఎందుకంటే.. ఇది పబ్లిక్ కు ఇబ్బంది (పబ్లిక్ న్యూసెన్స్) కలిగించేదిగా మారుతుంది. అంతేకాదు.. చట్ట ప్రకారం దేవాలయాలు.. స్కూళ్లు.. ఆసుపత్రులు.. ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రజా సమూహాలు ఉండే ప్రాంతాలకు నిర్దిష్ట దూరంగా వేశ్యావృత్తిని నిర్వహించటం.. దానికి సంబంధించిన కార్యకలాపాలు చేయటం చట్టవిరుద్ధమన్నది మర్చిపోకూడదు. ఈ అంశాలు చట్టాల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.

ఒక మహిళ రోడ్డు మీద నిలిచి.. క్లయింట్లను ఆకర్షిస్తూ.. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా.. రాకపోకలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తుంటే పోలీసులు ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. న్యాయ సంహిత.. స్థానిక పోలీసు చట్టాల కింద చర్యలు తప్పవు. అయితే.. ఇలాంటి చర్యలు తీసుకునే వేళలోనూ పోలీసులు సదరు మహిళ విషయంలో అమర్యాదగా ప్రవర్తించకూడదన్నది మర్చిపోకూడదు.

చర్యల వేళ.. శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధింపులకు గురి చేయకూడదని మాత్రమే సుప్రీం స్పష్టం చేసింది. అదే సమయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంది. అదే సమయంలో అరెస్టు వేళ.. అనుసరించాల్సిన విధానాల్ని తూచా తప్పకుండా పోలీసులు అనుసరించాల్సి ఉంటుంది. చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో పోలీసులు సెక్స్ వర్కర్ల పట్ల మానవీయంగా.. మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. వారి ప్రాథమిక మానవ హక్కులను కాలరాయకూడదన్నది మర్చిపోకూడదు.