ధోని బిగ్ స్టేట్మెంట్‌కు రెడీగా ఉండాలా?

ఈ రోజు ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కాబోతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెద్ద షాకే ఇచ్చింది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్‌లో తొలి రెండు వారాలు ఆటకు అందుబాటులో ఉండడని ప్రకటించింది. పిక్క గాయానికి చికిత్స తీసుకుంటున్నట్లుగా వెల్లడైంది. కానీ ధోని ఇలా గాయపడి ఉంటే.. చికిత్స తీసుకుంటున్న మాట నిజమైతే ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించి ఉండాల్సింది.

ధోని అసలు సంవత్సరంలో మిగతా పది నెలలు క్రికెట్టే ఆడడు. మరి గాయం ఎప్పుడైంది.. ఎందుకైంది అన్నది అర్థం కాని విషయం. సరిగ్గా ఐపీఎల్ మొదలయ్యే రోజు ధోని గాయం గురించి వెల్లడించడం.. తొలి రెండు వారాలు అందుబాటులో ఉండడని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించడమే కాక.. అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

ధోనీని ఈ సీజన్ ముంగిట ప్రాక్టీస్‌లో, ప్రమోషనల్ ఈవెంట్లలో గమనిస్తే.. గతంలో ఉన్నంత ఫిట్‌గా లేడన్నది స్పష్టం. చెపాక్ స్టేడియంలో కొన్ని రోజుల ముందు జరిగిన ఈవెంట్లో సినీ నటుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ.. మీరు ఎన్ని సీజన్లయినా ఆడుతూనే ఉండాలి అన్నట్లుగా మాట్లాడితే.. తన ఫిట్‌నెస్ అంతకంతకూ తగ్గుతూ ఉందని వ్యాఖ్యానించాడు మహి.

దీన్ని బట్టి ఇంకెంతో కాలం తాను ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు సీజన్ ఆరంభం కాబోతుండగా.. ధోని గాయం గురించి బాంబు పేల్చారు. ఈ స్టేట్మెంట్ టైమింగ్ చూస్తే.. అసలు ధోని ఈ సీజన్లో ఆడతాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తంగా ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని.. ఆ దిశగా అభిమానులను ప్రిపేర్ చేయడం కోసమే ఇప్పుడీ ప్రకటన చేశారేమో అన్న చర్చ జరుగుతోంది.

ఈ సీజన్లో రెండు మూడు మ్యాచ్‌లు నామమాత్రంగా బరిలోకి దిగి.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటన చేయొచ్చనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ధోనికి 41 ఏళ్లు వచ్చేశాయి. కొన్నేళ్ల నుంచి ధోని బ్యాటింగ్ ఏమంత గొప్పగా సాగట్లేదు. మోకాలి గాయం అతణ్ణి ఇబ్బంది పెడుతున్నా అతి కష్టం మీద లీగ్‌లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ సీజన్ తర్వాత ధోని ఇక చాలు అనిపించేస్తే ఆశ్చర్యమేమీ లేదు.