నెంబర్ లేకుండానే వాట్సాప్ చాటింగ్

మీ ఫోన్ నంబర్ ఎవరికీ తెలియకుండానే వాట్సాప్‌లో ఛాట్ చేసే రోజులు రాబోతున్నాయి. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ త్వరలో ‘యూజర్ నేమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు వాట్సాప్ వాడాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి, కానీ ఇకపై ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహాలో ఒక యూనిక్ పేరుతో అకౌంట్ ని వాడుకోవచ్చు. దీనివల్ల తెలియని వ్యక్తులకు మన వ్యక్తిగత కాంటాక్ట్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రైవసీని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఊరట అని చెప్పొచ్చు.

2026 జూన్ నాటికి ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం మెసేజ్ పంపడమే కాకుండా, వాయిస్, వీడియో కాల్స్ కూడా ఈ యూజర్ నేమ్ ద్వారానే చేసుకోవచ్చు. వాట్సాప్ మొదలైనప్పటి నుంచి ఫోన్ నంబర్ ఆధారంగానే గుర్తింపు ఉండేది, కానీ ఇప్పుడు ఆ పద్ధతిలో భారీ మార్పు రాబోతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర యాప్స్‌లో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ, వాట్సాప్ యూజర్లు దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఫీచర్ ఒక ఛాయిస్ మాత్రమే. అంటే మీరు మీ ఫోన్ నంబర్ ద్వారానే కంటిన్యూ అవ్వాలా లేదా కొత్తగా యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం. ఒకవేళ ఎవరి దగ్గరైనా మీ ఫోన్ నంబర్ ఇప్పటికే సేవ్ అయ్యి ఉంటే, వారు ఎప్పటిలాగే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులకు మాత్రం నంబర్ బదులు మీ యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది.

యూజర్ నేమ్స్ తో పాటు వాట్సాప్ ‘గెస్ట్ ఛాట్స్’ అనే మరో కొత్త ప్రయోగాన్ని కూడా చేస్తోంది. దీని ద్వారా వాట్సాప్ అకౌంట్ లేని వారు కూడా ఒక లింక్ ద్వారా బ్రౌజర్‌లో సంభాషణల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి కేవలం టెక్స్ట్ మెసేజ్ పంపే సౌకర్యం మాత్రమే ఉండవచ్చు. ఈ గెస్ట్ ఛాట్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. అకౌంట్ క్రియేట్ చేయకుండానే అవతలి వ్యక్తితో మాట్లాడాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.