రాజమహేంద్రవరంలో పెద్దపులి సంచారం ముగిసిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్న వేళ… మరోవైపు శ్రీసత్యసాయి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మడకశిర మండలం ఎల్లోటి గ్రామ పరిసరాల్లో చిరుత తిరుగుతోందనే సమాచారం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
గ్రామానికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో జింక కళేబరం కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. పొలానికి వెళ్లిన రైతు ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చిరుత ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. జింక కళేబరాన్ని దహనం చేసి, పరిసర ప్రాంతాల్లో పాదముద్రలు, సంచార మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలోని అటవీ ప్రాంతంలో మేక, కుక్కలపై దాడి చేసి చంపిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు జింక వేట జరగడంతో చిరుత సంచారం స్పష్టమైందని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం తర్వాత బయటకు వెళ్లేందుకు భయపడుతున్నామని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపడం మానేశామని గ్రామస్తులు వాపోతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. “ఆపరేషన్ జాక్” పేరుతో అటవీశాఖ చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఆ పులిని విజయవంతంగా బంధించారు. ఆరు రోజుల పాటు ప్రజలను భయపెట్టిన ఆ ఘటనకు శుభం కార్డు పడింది.
అయితే ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లాలో చిరుత కలకలం మొదలవడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. అవసరమైతే కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతామని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు.
వన్యప్రాణులు జనావాసాలకు చేరువ కావడం వెనుక అడవుల తగ్గుదల, ఆహార లోపం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో భయం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందించి పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates