పాకిస్తాన్.. కక్కలేక మింగలేక…

టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లా తయారైంది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని ఒకవైపు ఆపలేక, మరోవైపు ఐసీసీ హెచ్చరికలను కాదనలేక పీసీబీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆదివారం లాహోర్‌లో జరిగిన ఐసీసీ మీటింగ్‌లో ఈ డైలమా స్పష్టంగా బయటపడింది.

పాక్ ప్రభుత్వం మాత్రం భారత్‌తో మ్యాచ్ ఆడొద్దని పీసీబీకి కఠిన ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి రావడం వెనుక భారత్ హస్తం ఉందంటూ, దానికి నిరసనగా తాము ఆడమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.

అయితే ఐసీసీ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను సాకుగా చూపి మెగా టోర్నీల్లో మ్యాచ్‌లను బహిష్కరించడం కుదరదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం మాట వినకపోతే దేశంలో ఇబ్బంది, ఐసీసీ మాట వినకపోతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉండటంతో పీసీబీ కక్కలేక మింగలేక సతమతమవుతోంది.

ఈ వివాదంలో పాకిస్థాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని ఐసీసీని నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు ఐసీసీ డబ్బులు చెల్లించాలని పీసీబీ కోరుతోంది. కానీ ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్‌కు వారి వాటాగా రావాల్సిన ఆదాయం తప్ప, ఒక్క రూపాయి కూడా అదనంగా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇలా లేనిపోని డిమాండ్లతో కాలయాపన చేయడం వల్ల పాక్ క్రికెట్‌కే నష్టమని ఐసీసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.

ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా పీసీబీకి ఒక గట్టి సలహా ఇచ్చారు. ఇలాంటి మొండి పట్టుదలతో క్రికెట్‌కు కీడు చేయవద్దని, ఏదైనా సమస్య ఉంటే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో లేదా ఆర్బిట్రేషన్ కమిటీ ముందు తేల్చుకోవాలని సూచించారు.

టోర్నీ ఇప్పటికే మొదలై మ్యాచ్‌లు సాగుతున్న తరుణంలో, ఇంకా ప్రభుత్వ అనుమతి కావాలని నాన్చడం పీసీబీ అసమర్థతను చూపిస్తోందని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పీసీబీ భారీ ఆర్థిక నష్టాన్ని భరించడమే కాకుండా, ఐసీసీ నుంచి సస్పెన్షన్ వేటును కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి పీసీబీ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటుందో.