టీ20 వరల్డ్ కప్.. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఉండొచ్చు కానీ, ఆ గెలుపు వెనుక ఉన్న చేదు నిజాన్ని మాత్రం విస్మరించలేం. ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా ముద్రపడ్డ టీమిండియాను ఒక చిన్న టీమ్ ఆ రేంజ్‌లో కంగారు పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఏదో పెద్ద జట్లతోనే టఫ్ ఫైట్ ఉంటుందనుకుంటే, పసికూన అమెరికా చేతిలో గ్రూప్ దశలోనే ఇలా తడబడటం మన బ్యాటింగ్ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ వీరోచిత పోరాటమే భారత్‌ను గండం నుంచి గట్టెక్కించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సూర్య (84 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయబట్టి కనీసం పోరాడే స్కోరైనా బోర్డు మీద నిలిచింది. కేవలం 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పరిస్థితి చూస్తుంటే, ఒకవేళ సూర్య కూడా ఫెయిల్ అయి ఉంటే భారత్ పరిస్థితి ఏంటనేది ఊహించుకోవడానికే భయం వేస్తోంది.
బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటం వల్లే మనం ఈ మ్యాచ్‌లో ఊపిరి పీల్చుకోగలిగాం. 161 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మన బౌలర్లు తమ అనుభవాన్నంతా ఉపయోగించి అమెరికాను కట్టడి చేశారు. కానీ ప్రతిసారి బౌలర్లే గెలిపిస్తారని కూర్చుంటే పొరపాటే అవుతుంది. బ్యాటర్లు బాధ్యతారాహిత్యంగా వికెట్లు పారేసుకోవడం చూస్తుంటే, పెద్ద జట్లతో తలపడేటప్పుడు ఇదే తీరు కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
నిజానికి వరల్డ్ కప్ ప్రయాణంలో ఈ సడన్ షాక్ తగలడం ఒక విధంగా మంచిదే. ఏ జట్టును లైట్ తీసుకోవద్దని, అతి విశ్వాసం పనికిరాదని ఈ మ్యాచ్ ఒక గట్టి గుణపాఠం నేర్పింది. న్యూజిలాండ్ సిరీస్‌లో సృష్టించిన విధ్వంసాన్ని మరిచిపోయి, మళ్ళీ మొదటి నుంచి తమ బలాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆటగాళ్లకు ఒక హెచ్చరిక అందింది. ఎవరో ఒక్కరు ఆడినా చాలు అనే భ్రమలోంచి బయటకు వచ్చి, టీమ్ మొత్తం సమష్టిగా రాణించాలి.
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో గెలవాలంటే పక్కా ప్లాన్ తో వెళ్లాలి. అమెరికా మ్యాచ్ ఇచ్చిన ఈ చిన్న షాక్ ని ఒక వార్నింగ్ లాగా తీసుకుని, లోపాలను సరిదిద్దుకుంటేనే మనం టైటిల్ రేసులో నిలవగలం. లేదంటే ఆరంభంలో తగిలిన ఈ దెబ్బ టోర్నీ ఆఖరి వరకు వెంటాడే ప్రమాదం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
