ముఖ్యమంత్రి పార్టీకి మంగళం

ముఖ్యమంత్రి పార్టీకి మంగళం

కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఒకటే టాక్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారు అని. అలాంటిది ఇక ఆ పార్టీకి మంగళం పాడినట్టే అన్నది క్లియర్ అయింది. ఆయన రాజీనామా చేసారు కదా, ఆయన మద్దతుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెల్లారు కదా, ఇక పార్టీ పెట్టేస్తున్నారు అన్న టైంలో ఇప్పుడు ఆయన పార్టీ పెట్టడం లేదు అని ఎలా చెప్పగలం అన్నదే కదా మీ సందేహం. ముఖ్యమంత్రి పార్టీ వెనుక నిజానికి ఓ పెద్ద రాజకీయ డ్రామా జరిగింది.

రాజకీయాల్లో, మీడియాల్లో జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం మొదటి నుంచి కిరణ్ కొత్తపార్టీని ప్రోత్సహిస్తూ వచ్చింది. కారణం ఆయన కొత్త పార్టీ పెడితే సమైక్యం పేరుతో కాబట్టి ఆయన పార్టీ జగన్ ఓట్లను చీలుస్తుంది. తద్వారా చంద్రబాబు కు ప్లస్ అవుతుంది అని భావించారు. ఏపిఎన్జీఓలను కూడా కిరణ్ దగ్గరికి తీయడంతో చంద్రబాబుకు మొదటి నుంచి దూరంగా ఉండే ఉద్యోగుల ఓట్లను కూడా జగన్ వైపుకు పోకుండా కిరణ్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని భావించారు. అయితే కిరణ్ వ్యవహారశైలితో ఆయన పరిస్థితి సీమాంద్రలోను, సీమాంద్ర కాంగ్రెస్ లోను బెడసికొడుతూ వచ్చింది.

చివరకు ఆయన సమైక్యం ముసుగులో చేసింది విభజనే అన్న భావం సీమాంద్రలో నెలకొంది. సమైక్యపరిరక్షణ సమితి నాయకులు చలసాని ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు. అశోక్ బాబు కూడా కిరణ్ పంచన చేరి అదే చేసారని ఆరోపించారు. దీంతో సమైక్యం విషయంలో కిరణ్ మైనస్ అయ్యారు. అంతే కాదు ఆయన రాజీనామా చేసే నాటికే చాలా మంది సీమాంద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి దారి వారు చూసుకోగా మిగిలిన వారిలో కూడా చాలా మంది ఆయన వెంట నడవలేదు. రాజీనామా చేసేటప్పుడు ఉన్న వారు, సాయంత్రానికల్లా మాయమయ్యారు. దీంతో కిరణ్ వెంట ఉండే వారెంత మంది అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

అయితే జగన్ ఓట్లను చీలుస్తారని భావించి ఆయనకు బాసటగా నిలిచిన చంద్రబాబు వర్గానికి ఇప్పుడో దఢ పట్టుకుంది. కిరణ్ పార్టీ జగన్ ఓట్లను చీల్చడం మాట అటుంచి కొంపదీసి చంద్రబాబు ఓట్లకే గండి కొట్టదు కదా అన్న సందేహాలు తాజాగా ఉత్పన్నమయ్యాయి. దీంతో వెంటనే సర్దుకున్న వారు కిరణ్ వెంట బడకుండా తప్పించుకోవడం మొదలు పెట్టారు. ఇక జేడి శీలం వంటి వారు కాంగ్రెసే అంటున్నారు. బొత్స వర్గం కూడా తయారయింది, చిరంజీవి వంటి వారు కూడా కిరణ్ వైఖరిని ఎండగడుతున్నారు. ఇక ఆయనే సూపర్ బ్యాట్స్ మెన్ అని పొడగిన లగడపాటి కూడా మాట మార్చి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అందుకే కిరణ్ కొత్త పార్టీ ఇక హుళక్కే అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English