పవన్ నినాదం పై బండ్ల కమెంట్

పవన్ నినాదం పై బండ్ల కమెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ తన అభిమాన కథానాయకుడు పెట్టిన జనసేన పార్టీని కాదని.. కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కాంగ్రెస్ పార్టీని గతంలో పవన్ ఏ స్థాయిలో వ్యతిరేకించాడో.. ఆ పార్టీ మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అందరికీ గుర్తు ఉంది. మరి అలాంటి పార్టీలో చేరిన బండ్ల గణేష్.. తన హీరోకు వ్యతిరేకంగా మాట్లాడతాడా.. అవసరమైతే విమర్శలు గుప్పిస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఐతే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆ పని చేయనని.. తాను చచ్చే వరకు పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటానని గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

బండ్ల గణేష్ అనేవాడు బండ్ల నాగేశ్వరరావు కొడుకు అనేది ఎంత నిజమో.. పవన్ కళ్యాణ్ భక్తుడిగా జీవితాంతం ఉంటాడనేది అంతే నిజమని గణేష్ స్పష్టం చేశాడు. పార్టీలు వేరైనప్పటికీ తమ మధ్య అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని గణేష్ తేల్చి చెప్పాడు. మరి ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అంటూ పవన్ ఇంతకుముందు చేసిన నినాదం సంగతేంటి అని అడిగితే.. పవన్ అలా అని ఉంటాడని తాను అనుకోవట్లేదని బండ్ల వ్యాఖ్యానించడం విశేషం.

తాను మాత్రం పవన్ మీద ఎప్పటికీ విమర్శలు చేయనన్నాడు. తనకు నచ్చి న హీరో.. తనకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. అలాగే తనకు నచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని.. తాను చిన్నతనం నుంచి ఈ పార్టీకి అభిమానినని బండ్ల చెప్పాడు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. వ్యాపారం వేరని.. వీటిలో దేన్నీ కలపొద్దని బండ్ల విజ్ఞప్తి చేశాడు. పవన్ కళ్యాణ్‌ తో మళ్లీ ఇంకో సినిమా చేయాలన్నది తన కోరిక అని.. అది కచ్చితంగా తీరుతుందని.. భవిష్యత్తులో తమ కలయికలో సినిమా వస్తుందని బండ్ల స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English