గులాబీ శ్రేణులు అవాక్క‌య్యే ప‌రిణామం ఇది

గులాబీ శ్రేణులు అవాక్క‌య్యే ప‌రిణామం ఇది

గులాబీ పార్టీ శ్రేణులు అవాక్క‌య్యే ప‌రిణామం ఇది.  టీఆర్ఎస్‌లో పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ అంటేనే స‌ర్వం అనే సంగ‌తి తెలిసిందే. మంత్రులు, సీనియ‌ర్ నేతలు...వ్య‌వ‌స్థాప‌క స‌భ్యులు సైతం...ఆఖ‌రికి త‌న కుటుంబ స‌భ్యులు అయిన మంత్రులు కేటీఆర్‌, క‌విత‌, హ‌రీశ్ రావులు కూడా స్వేచ్ఛ‌గా త‌మ భావాల‌ను వ్య‌క్తం చేయ‌లేర‌నే టాక్ ఉంది.

అలాంటి కేసీఆర్ అవాక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఆయ‌న‌కు 24 గంట‌ల టైం మాత్ర‌మే ఇచ్చి ``ఏదైనా నిర్ణ‌యం తీసుకో...లేదంటే...నేనే ఓ నిర్ణ‌యం తీసుకుంటా`` అని ఓ మాజీ ఎమ్మెల్యే ఆర్డ‌ర్ వేశారు. ఆమె ఎవ‌రో కాదు...ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు కొండా సురేఖ‌.

టీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించిన తొలిజాబితాలో పేరులేక‌పోవ‌డం, ఆమె కాంగ్రెస్ గూటికి చేర‌నున్నార‌నే ప్ర‌చారం నేపథ్యంలో తాజాగా సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్ కొండా సురేఖ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వరంగల్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గతంలో 45 వేల భారీ మెజారిటీతో గెలిచినా...టీఆర్ఏస్ మొదటి లిస్ట్‌లో త‌నపేరు లేకపోవడం భాధ కలిగించిందన్నారు.

ఆ భాధతో మీ ముందుకు వచ్చా అని మీడియాకు వెల్ల‌డించారు. ``12 లో 11 స్థానాలు ప్రకటించి బీసీ మహిళ గా నా పేరు ప్రకటించకపోవడం బాధాకరం. 2014లో పరకాల నుంచి పోటిచేయాలనుకున్నాను. అయితే, వరంగల్ ఈస్ట్‌లో బస్వరాజు సారయ్యను ఓడించాలంటె మీరు పోటిలో ఉండాలని కేసీఆర్ కోరారు..ఇష్టం లేకున్నా పోటీచేశాను. ఏంపీని కూడా మా సొంత డబ్బులు పెట్టి గెలిపించాం. కార్పోరేషన్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ గెలుపున‌కు కూడా మా సొంత డబ్బులు పెట్టి గెలిపించాం. ఇప్పటివరకు పార్టీ వ్యతిరేకంగా మాట్లడలేదు. నాకు హామీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకున్నా...అభివృద్ధి కోసం పార్టీలో ఉన్నాను. మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వం టీఆర్ఎస్‌`` అని మండిప‌డ్డారు.

త‌న భ‌ర్త కొండా మురళీధర్ రావు పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారని కొండా సురేఖ వెల్ల‌డించారు. ``టీఆర్ఎస్ మొదటి జాబితాలో నాపేరు లేదంటే కేవలం నన్ను కాదు బీసీ మహిళలందరిని మోసం చేయ‌డ‌మే. నేను, బొడిగె శోభ, నల్లాల ఓదెలు, బాబు మోహన్ వీళ్ళంతా ఎస్సీలు,బీసీలే. ఎస్సీలను, బీసీల‌ను కేసీఆర్ పక్కన పెట్టారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి లాభం పొందలేదు. వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అభిమానులున్నారు. పార్టీతో సంబంధం లేకుండా మమ్మల్ని గెలిపిస్తున్నారు. అలాగే గెలుస్తాం` అని వెల్ల‌డించారు. `ఎర్రబెల్లి దయాకర్ రావును, గుండు సుధారాణి ,బస్వరాజు సారయ్య ను పార్టీ లో చేర్చుకునే ముందు మాకు చెప్పలేదు. మా తర్వాత పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లికి ఎందుకు పార్టీలో అంత ప్రాధాన్యత? ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల అందరికీ బీ ఫామ్స్‌...ఇస్తారనే నమ్మకం ఉందా? కేటీఆర్ రెండు రోజుల కింద ఫోన్ చేసి భూపాలపల్లి టికెట్ ఇవ్వలేక పోతున్నాం..పరకాల లో పోటీ చేయడం డి మీరు పోటి చేస్తారా, మీ పాప పోటీ చేస్తారా అని అడిగితే ..మా కుటుంబ సభ్యులను అడిగి చెప్తా అన్నాను. కానీ రెండు టిక్కెట్లు అడిగామని దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు పరకాల టిక్కెట్ ఇస్తా అంటె ఓకే అని చెప్పాను. అయినా పొమ్మనక పొగబెడుతున్నారు`` అని ఆరోపించారు.

 తనకు టికెట్‌ రాకపోవడానికి కేటీఆరే కారణమని దుయ్య‌బ‌ట్టారు. సొంత టీమ్‌ను కేటీఆర్‌ సిద్దం చేసుకుంటుండని, అందుకు తమలాంటి వారిని పక్కన పెట్టారన్నారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలు సృష్టించింది ఆయన్నే అని ఆరోపించారు. కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు. తమ ఫోన్స్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఏంపీగా ఉన్న బాల్క సుమన్, ఎమ్మెల్సీగా ఉన్న నరేంద‌ర్ రెడ్డికి ఎందుకు టిక్కెట్ ఇచ్చార‌ని కొండా సురేఖ‌ ప్ర‌శ్నించారు. త‌మ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు.

``రెండు మూడు రోజుల్లో మా నిర్ణయం బ‌హిరంగ లేఖ ద్వారా తెలియజేస్తాం. ప్ర‌స్తుత స్పీక‌ర్ మధుసూదనాచారికి ఇవ్వకుంటె మాకు ఇవ్వమని అడిగాం. చారి గారు మా కార్యకర్తల పై కేసులు పెడితే వారు మమ్మల్ని పోటీ చేయాలని కోరారు. ఈస్ట్, పరకాల, భూపాలపల్లిలో మేమే పోటీ చేస్తాం..మీకు ఏమైనా అభ్యంతరమా? మేం ఎక్కడికి పోయినా...మమ్మల్ని ఇతర పార్టీలు తీసుకుంటాయి. 24 గంటలలోపు వాళ్ల‌ నిర్ణయం ప్రకటించకపోతే మా నిర్ణయం ప్రకటిస్తాం`` అంటూ సంచ‌ల‌న  వ్యాఖ్య‌లు చేశారు.

ఇండిపెండెంట్‌గా ఎక్కడ నిలబడ్డా గెలిచే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సమాధానం బట్టి రెండు రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే పరకాల, భూపాల పల్లి, వరంగల్‌ ఈస్ట్‌ మూడు స్థానాల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేస్తామన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు