`అమ‌రావ‌తి`బాండ్లు...42 వేల కోట్లు!

`అమ‌రావ‌తి`బాండ్లు...42 వేల కోట్లు!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. లోటు బ‌డ్జెట్ తో ఏర్ప‌డిన అవ‌శేషాంధ్ర‌ప్రదేశ్ కు త‌ల‌మానిక‌మైన అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా తీర్చిదిద్దేందుకు చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న విష‌యం విదిత‌మే. అయితే, ఏపీకి హోదా ఇవ్వ‌కుండా, విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌కుండా తాత్సారం చేస్తోన్న బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన వేల కోట్ల రూపాయ‌ల నిధుల విడుద‌ల‌కు కేంద్రం మోకాల‌డ్డింది.

ఇక‌పై ఏపీకి కేంద్రం సాయం చేస్తుంద‌న్న న‌మ్మ‌కం కూడా స‌న్న‌గిల్ల‌డంతో అమ‌రావ‌తి నిర్మాణానికి నిధుల కోసం చంద్ర‌బాబు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే 42 వేల కోట్ల రూపాయ‌ల విలువైన బాండ్ల‌ను జారీ చేసేందుకు ప్ర‌తిపాద‌న‌ల‌ను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌కు సీఎం చంద్ర‌బాబు కూడా సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

క‌ట్టుబ‌ట్ట‌ల‌తో న‌వ్యాంధ్ర‌లో అడుగుపెట్టామ‌ని, రాజ‌ధాని అమరావ‌తి నిర్మాణానికి ఆంధ్రా ప్ర‌జ‌లు, ప్ర‌వాసాంధ్రులు కూడా త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాలందించాల‌ని సీఎం చంద్ర‌బాబు గ‌తంలోనే పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల సేక‌ర‌ణ‌కు బాండ్లు జారీ చేయాల‌ని సీఆర్డీఏ అధికారులు అంచ‌నాలు రూపొందించార‌ట‌. దాదాపు 42 వేల కోట్ల రూపాయ‌ల విలువైన బాండ్ల‌ను జారీ చేసేందుకు అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌ల‌ను చంద్ర‌బాబుకు వివ‌రించార‌ట‌. ఆ ప్ర‌తిపాద‌న‌ల‌కు చంద్ర‌బాబు కూడా దాదాపుగా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఆ బాండ్ల‌కు `అమ‌రావ‌తి`బాండ్లు లేదా `స్మార్ట్ సిటీ` బాండ్లు అన్న పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌.

అయితే, రిజ‌ర్వ్ బ్యాంకు సేవింగ్స్ బాండ్ల‌కు 7.75 శాతం, నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ల‌కు 7.6 శాతం వ‌డ్డీ ల‌భిస్తోంది. దీంతో, అమ‌రావ‌తి నిర్మాణం కోసం జారీ చేయ‌నున్న‌ బాండ్ల‌కు 8 శాతం వ‌డ్డీ ఫిక్స్ చేస్తే బాగుంటుంద‌ని అధికారులు భావిస్తున్నార‌ట‌. దీనికోసం ఓ క‌మిటీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోందట‌. అయితే, ఈ స‌రికొత్త బాండ్ల‌లో అధిక‌శాతం ప్ర‌వాసాంధ్రుల‌కు జారీ చేయాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ట‌. అమ‌రావ‌తి నిర్మాణంలో భాగ‌స్వాముల‌య్యేందుకు ఎన్నార్టీలు, ప్ర‌వాసాంధ్రులు ఆస‌క్తిగా ఉన్నార‌ని చంద్ర‌బాబు చెప్పార‌ట‌. అమ‌రావ‌తి నిర్మాణం అంచ‌నా వ్య‌యం 52 వేల కోట్ల రూపాయ‌లు కాగా....ఇప్ప‌టికి కేంద్రం కేవ‌లం వెయ్యి కోట్లు మంజూరు చేసింది. గుంటూరు, విజ‌య‌వాడ‌ల అభివృద్ధికి 1500 కోట్లు ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు