వీర్రాజు వ‌ద్దు..క‌న్నా ముద్దు...ఎన్నో లెక్క‌ల‌కు ఇదే స్కెచ్

వీర్రాజు వ‌ద్దు..క‌న్నా ముద్దు...ఎన్నో లెక్క‌ల‌కు ఇదే స్కెచ్

సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డి ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్త‌యింది. చాలాకాలంగా కసరత్తు జరిగి, వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఈ పదవిని ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన నేతకే కట్ట బెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ఈ క్రమంలోనే మొదటి నుంచి కాపు నేతలైన సోము వీర్రాజు, మాణి క్యాల రావు, కన్నా లక్ష్మీనారాయణ పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఈ ముగ్గురిలో తెలుగుదేశం పార్టీపై ఒంటి కాలితో విరుచుకుపడే సోము వీర్రాజు వైపే ఎక్కువ మొగ్గు చూపింది. దాదాపు వీర్రాజుకే ఎక్కువ చాన్స్ అని బీజేపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేశాయి. అయితే అనూహ్య రీతిలో మాజీ మంత్రి, కొద్దికాలం క్రితం పార్టీలో చేరిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆ ప‌దవికి ఎంపిక చేసింది. ఈ ప‌రిణామం వెనుక అనేక లెక్క‌లు ఉన్నాయ‌ని అంటున్నారు.

బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికలో ఆచితూచి వ్యవహరించింది. ఎమ్మెల్సీ వీర్రాజు, మంత్రి మాణిక్యాలరావు పేర్లు తెర‌పైకి వ‌చ్చిన‌ప్పుడు కొన్ని కార‌ణాల‌తో ప‌క్క‌న‌పెట్టింది. దీనికితోడు మాణిక్యాల రావు సైతం పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలో కన్నా లక్ష్మీ నారాయణను చేయాలని నిర్ణయానికి వచ్చింది. మ‌రోవైపు పార్టీలో ఒక వర్గం మాత్రం వీర్రాజు ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ పెద్దాయన, ఆయన శిష్యగణం వీర్రాజు పేరెత్తితేనే శివాలెత్తిపోయేవారు. వీర్రా జుతో పాటు పరిశీలనలో ఉన్న మిగతా ఇద్దరు నేతలను కూడా ఆ వర్గం వ్యతిరేకించింది. ఇదే స‌మ‌యంలో ఈ ఇద్దరి కంటే కన్నా లక్ష్మీనారాయణ తగినవాడని అధిష్టానం మొదటి నుంచి భావించినప్పటికీ, మొదటి నుంచి పార్టీలో లేడన్న ఒకే ఒక కారణంతో రేసులో తర్వాతి వరుసలో నిలిపింది. అయితే ఈ కసరత్తు జరుగుతున్న తీరు చూసి కన్నా లక్ష్మీనారాయణ నొచ్చుకున్నారని, ఆ క్రమంలోనే పార్టీని వీడి వైకాపాలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఈ ప్రయత్నాలను తెలు సుకున్న అధిష్టానం కన్నాకు ఫోన్‌ చేసి వైకాపాలో చేరే ప్రయత్నాలను విరమించుకోవాల్సిందిగా సూచించింది. ఆ సమయానికి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో మునిగిపోయినందున కొన్నాళ్లు ఓపిక పట్టాలని తెలిపింది. ఆ నిరీక్షణకు తగిన ఫలితాన్ని కట్టబెడుతూ రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలనే అప్పగించింది.

ఇదిలాఉండ‌గా...అధిష్టానం ఆలోచ‌న‌లు సైతం ఈ ఎంపిక‌కు తోడ్ప‌డ్డాయి. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉన్నందున కన్నాను ఎంపిక చేయడమే సరైన నిర్ణయమని అధిష్టానం సైతం భావించేలా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధవ్‌ వ్యవహరించారు. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తెలుగుదేశం పార్టీ బీజేపీని దోషిగా నిలబెడుతూ రాజకీయ ప్రచారానికి తెరలేపిన నేప‌థ్యంలో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వీర్రాజును మించి క‌న్నా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌ర‌ని భావించి ఈ ఎంపిక చేప‌ట్టింది.

మ‌రోవైపు క‌న్నా సామ‌ర్థ్యం కూడా కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో దాదాపుగా రెండున్న‌ర ద‌శాబ్దాలుగా తిరుగులేని లీడ‌ర్‌గా క‌న్నా ఎదిగారు. ఆయ‌న రాజ‌కీయంగా బ‌లంగా ఉండ‌డంతో పాటు కాపు నేత‌ల‌ను ఏక‌తాటిపైకి న‌డిపే అవ‌కాశం ఉంద‌ని భావించారు. మ‌రోవైపు రాజ‌ధాని ప్రాంతం నేత కావ‌డం క‌న్నాకు క‌లిసివ‌చ్చిందంటున్నారు. కాపు ఉద్య‌మ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం  బీజేపీలో చేరే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి నాలుగు జిల్లాల్లో బీజేపీకి తిరుగు ఉండ‌ద‌ని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు