శిల్పా శెట్టి పోరాటం వాళ్ల మీద..

తన భర్త పోర్న్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వాటిని మొబైల్ అప్లికేషన్లలో రిలీజ్ చేస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టయి రిమాండు ఎదుర్కొంటుంటే.. శిల్పా శెట్టి న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఐతే ఆమె ఇప్పుడు పోరాడబోయేది మీడియాతో కావడం గమనార్హం. భర్తను బయటికి తేవడానికి చేసే న్యాయ పోరాటం మామూలే. ఆ పని ఓ వైపు జరుగుతుంటుంది. ఈ లోపు మీడియా పని పట్టడానికి సిద్ధమైంది శిల్పా శెట్టి.

రాజ్ కుంద్రా అరెస్టు నేపథ్యంలో అతడి లీలలపై వారం రోజులుగా మీడియాలో బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. అతను పోర్నోగ్రఫీకి సంబంధించి ఏం చేశాడు.. ఏమేం అడ్డదారులు తొక్కాడు.. మోడల్స్‌ను ఎలా ఇటు వైపు మళ్లించాడు.. ఈ బిజినెస్‌ను ఎలా రన్ చేశాడు.. పోలీసుల దృష్టిలో ఎలా పడ్డాడు.. అనే విషయాలపై మీడియా జోరుగా కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో శిల్పా శెట్టి గురించి కూడా రకరకాల ఊహాగానాలు మీడియాలో షికారు చేస్తున్నాయి.

ఐతే తమ గురించి ఇలా కథనాలు రావడం శిల్పాను బాధించినట్లుంది. అందుకే బాలీవుడ్ మీడియా సంగతి తేల్చాలనుకున్నారు. మొత్తం ప్రధాన మీడియాలో వచ్చిన కథనాలన్నింటినీ సేకరించి.. 29 సంస్థ మీడియా సంస్థలు.. పలువురు జర్నలిస్ట్‌లపై బాలీవుడ్ నటి శిల్పా పరువు నష్టం కేసు వేసింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త రాజ్‌కుంద్రతో పాటు తమ కుటుంబానికి పరువునష్టం కలిగే విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును శుక్రవారం నాడు విచారణకు తీసుకుంటామని బాంబే హైకోర్టు తెలిపింది. కాగా రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్న అమ్మాయిల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

తాజాగా అతడిపై నటి షెర్లీన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో రాజ్‌కుంద్రా, అతడి టీంను ఒక బిజినెస్‌ మీటింగ్‌లో భాగంగా కలిశానని.. అది జరిగాక ఒకసారి అనుకోకుండా రాజ్ తన ఇంటికి వచ్చాడని.. శిల్పాతో తనకు సరైన సంబంధాలు లేవని చెబుతూ.. తనను హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. కుంద్రా ప్రవర్తనతో భయమేసి తప్పించుకుని పారిపోయినట్లు ఆమె వెల్లడించింది. ఆమె పోలీసుల విచారణకు హాజరైన సందర్భంగా ఈ ఆరోపణలు చేసింది.