ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ కానుక.. ముహూర్తాల్లేవ్

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా.. ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని ఎంతగానో ఆశించారు అభిమానులు. కానీ లాక్ డౌన్ కారణంగా జక్కన్న అండ్ టీం ప్రణాళికలు ఫలించలేదు. అరకొరగా ఏదో ఒకటి చేసి అసంతృప్తికి గురి చేయడం కన్నా.. అన్నీ సవ్యంగా ఉన్నపుడు పర్ఫెక్ట్‌గా టీజర్ తయారు చేసి రిలీజ్ చేయడమే మంచిదని చిత్ర బృందం భావించింది.

అందుకే అతడి పుట్టిన రోజున ఏ విశేషం ఉండబోదని తేల్చేసింది. ఐతే తారక్ పుట్టిన రోజు వెళ్లిపోయినా.. పరిస్థితులు అనుకూలిస్తే సాధ్యమైనంత త్వరగా అతడి పాత్రకు సంబంధించిన టీజర్ రలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మరి కొన్ని వారాల్లోనే షూటింగులకు ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ఎలాగూ సినిమాను వచ్చే సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్న నేపథ్యంలో రిలీజ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. రెగ్యులర్ షూటింగ్ సంగతి అలా ఉంచితే ముందు తారక్ టీజర్‌కు సంబంధించిన కంటెంట్ రెడీ చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. చిత్రీకరణపై ఆంక్షలు కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

మరి టీజర్ రిలీజ్ చేయడానికి తగ్గ సందర్భం ఏముంటుందా అని చూస్తే ఆగస్టు 15 లోపు ఏ అకేషన్ లేదు. ఐతే సందర్భం చూడకుండా కంటెంట్ రెడీ అవ్వగానే సాధ్యమైనంత త్వరగా దాన్ని రిలీజ్ చేసేయాలని చిత్ర బృందం డిసైడైపోయిందట. తారక్ అభిమానుల్ని ఎక్కువ రోజులు వెయిట్ చేయించకూడదన్న ఉద్దేశంతో ఇలా నిర్ణయించారట. కాబట్టి షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక కొన్ని వారాల్లోనే తారక్ టీజర్ రిలీజయ్యేందుకు అవకాశముంది.