పరామర్శ చాలు.. విమర్శలొద్దు జగన్‌ సార్‌

పరామర్శ చాలు.. విమర్శలొద్దు జగన్‌ సార్‌

ఛాన్సు దొరికితే చాలు ప్రభుత్వంపై విరుచుకుపడడంలో ముందుండే ప్రధాన ప్రతిపక్షం వైసీసీ అధినేత జగన్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. పరామర్శకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టడంతో ఇప్పుడు విమర్శలు అవసరమా సార్‌.. అంటూ ప్రజలు ఆయన్ను ప్రశ్నించారు. ఇటీవల  పుష్కర స్నానానికి విజయవాడ వెళ్లిన జగన్‌.. ఆ తరువాత అక్కడి నుంచి నీటిలో మునిగిపోయిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు నందిగామ వెళ్లారు. మృతుల్లో ఒకరైన లోకేశ్‌  అనే విద్యార్థి ఇంటికి వెళ్లి కుర్రాడి తల్లిదండ్రులను పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో అక్కడున్న లోకేశ్‌ బంధువులు జోక్యం చేసుకుని 'ఈ సమయంలో రాజకీయాలు ఎందుకు సార్‌?' అంటూ వారు జగన్‌ ను వారించారట.

అయితే.. జగన్‌ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ విమర్శలు కురిపించారు.  ప్రభుత్వ పెద్దలు ఇసుక దోపిడీ కారణంగానే నదిలో గుంతలు ఏర్పడ్డాయని జగన్‌ తనదైన శైలిలో సర్కారుపై విమర్శలు గుప్పించారు.  దీంతో హన్మంతరావు అనే వ్యక్తి కల్పించుకుని జగన్‌ తో ఆ విషయంపై చర్చ పెట్టారు. అందులో ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేదని చెప్పిన ఆయన... ఇసుక గోతులు ఈనాటివి కావని, వైఎస్‌ హయాంలో ఇసుక వేలం నిర్వహించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారని, ఆ కారణంగానే గుంతలు ఏర్పడ్డాయని జగన్‌ తో అన్నారు. అంతేకాదు.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏం చేస్తారో చెప్పండి? అంటూ ఆయన జగన్‌ ను నిలదీశారు.

ఊహించని పరిణామంతో ఇబ్బంది పడిన జగన్‌ వెంటనే తేరుకుని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామని, ఈలోగా తమ పార్టీ వారు వచ్చి సాయమందిస్తారని చెప్పారు. పరామర్శకు వచ్చిన తనను నిలదీస్తారేంటయ్యా వీరు అంటూ జగన్‌ ఆ తరువాత స్థానిక వేసీపీ నేతలతో అన్నట్లు సమాచారం. మొత్తానికి విమర్శించబోయే నిలదీతలు ఎదుర్కోవడంతో జగన్‌ బాగా ఫీలయ్యారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు