విజయ్ సరే.. ఆ దర్శకుడి పరిస్థితేంటి?

విజయ్ సరే.. ఆ దర్శకుడి పరిస్థితేంటి?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హీరో స్వామ్య రాజ్యం. రాజమౌళి లాంటి కొందరు మాత్రమే హీరోల్ని దాటిన ఇమేజ్‌తో సినిమా పూర్తిగా తమ చుట్టూ తిరిగేలా.. తమ ఇమేజ్ మీద నడిచేలా చూసుకుంటారు. అలాంటి కొందరు దర్శకుల్నిమినహాయిస్తే ఇక్కడ హీరోలదే రాజ్యం. హీరోలకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా తట్టుకుంటారు. ఒక ఇమేజ్ వచ్చాక అవకాశాలకు లోటు ఉండదు.

కానీ దర్శకుల పరిస్థితి అలా కాదు. వరుసగా రెండు ప్లాపులు పడ్డాయంటే చుట్టూ ఉన్న జనం ఖాళీ అయిపోతారు. మూణ్నాలుగు ఫ్లాపులొచ్చాయంటే అంతే సంగతులు. వైభవం అంతా కొట్టుకుపోతుంది. శ్రీను వైట్ల, వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ల పరిస్థితి ఏమైందో తెలిసిందే. ఎంతో ప్రతిభ ఉండి కూడా సరైన కమర్షియల్ హిట్లు పడకపోవడంతో చంద్రశేఖర్ యేలేటి ఎలా స్ట్రగులవుతున్నాడో తెలిసిందే.

సక్సెస్ లేకుండా డైరెక్టర్ల మనుగడ చాలా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు క్రాంతి మాధవ్ అనే దర్శకుడి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ‘ఓనమాలు’ లాంటి మంచి సినిమాతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకున్నా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ఐతే తర్వాత అతడి నుంచి వచ్చిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ప్రశంసలు అందుకుంది. ఓ మోస్తరుగా డబ్బులూ రాబట్టుకుంది. దీంతో ఈ దర్శకుడు నిలదొక్కుకున్నట్లే అనుకున్నారు.

కానీ ఆ తర్వాత తనకు ఏమాత్రం నప్పని.. ‘ఉంగరాల రాంబాబు’ అనే నాసిరకం సినిమా అందించాడు క్రాంతి. ఇదేదో పొరబాటుగా చేసిన సినిమా అని.. విజయ్ దేవరకొండ హీరోగా తీసే సినిమాతో తనేంటో మళ్లీ రుజువు చేస్తాడని అనుకున్నారు జనాలు. కానీ విజయ్‌తో క్రాంతి తీసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తుస్సుమంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం దక్కింది. రూ.70 కోట్ల షేర్ మూవీ ఉన్న విజయ్ నటించిన సినిమాకు పది కోట్ల షేర్ రాకపోవడాన్ని ఏమనాలి? అందరూ ఈ సినిమాతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని.. అతడి కెరీర్‌ ప్రమాదంలో పడిందని అంటున్నారు కానీ.. అతను మళ్లీ పుంజుకోవడానికి పెద్దగా టైం పడకపోవచ్చు. అతడికున్న టాలెంటుకి.. పూరీతోనో ఇంకొకరితోనే హిట్టు కొట్టేస్తాడు. కానీ వరుసగా ఇద్దరు నిర్మాతల్ని నిండా ముంచిన క్రాంతికి మాత్రం ఇకపై అవకాశాలు కష్టమే.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English