29 ఏళ్ల తర్వాత కరువు తీరింది

29 ఏళ్ల తర్వాత కరువు తీరింది

ఎవరెవరో అవార్డులు కొల్లగొడుతుంటారు. మన సినిమాలకు గుర్తింపు రాక.. కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారానికి కూడా నోచుకోక అవమాన భారాన్ని దిగమింగి సాగిపోయిన పరిస్థితి. కొన్నేళ్ల ముందు వరకు ఇలాగే దయనీయంగా ఉండేది తెలుగు సినిమా ముచ్చట. ఐతే కొన్నేళ్ల నుంచి పరిస్థితి మారుతోంది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటుతోంది.

ఈసారి ఏకంగా ఏడు అవార్డులు రావడంతో టాలీవుడ్ జనాలు మహదానందంతో ఉన్నారు. ముఖ్యంగా ఓ తెలుగు సినిమా నటికి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం దక్కడం ఈసారి అవార్డుల్లో అత్యంత ప్రత్యేకం. కీర్తి సురేష్ మనమ్మాయి కాకపోయినా.. మన సినిమాలో నటనకే ఆమెకు అవార్డు దక్కింది. ‘మహానటి’ ముందు వరకు కీర్తిని ఒక సాధారణ నటి. ఆమె నుంచి అద్భుత నటన రాబట్టుకున్న ఘనత మన నాగ్ అశ్విన్‌కే దక్కుతుంది.

ఒక తెలుగు సినిమా నటికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి ఏకంగా 29 ఏళ్లు కావడం విశేషం. 1990లో విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఆ తర్వాత ఎవ్వరికీ ఆ అవార్డు దక్కలేదు. కొన్ని సినిమాల్లో సౌందర్య అద్భుత అభినయం ప్రదర్శించినా ఆమెకు అవార్డు రాలేదు. రాను రాను హీరోయిన్లు గ్లామర్ డాల్స్‌గా మారిపోవడం.. వారి ప్రతిభను చాటుకునే పాత్రలు దక్కకపోవడంతో జాతీయ అవార్డుల గురించి ఆలోచించే పరిస్థితే లేకపోయింది. విజయశాంతి కంటే ముందు తెలుగు సినిమాల్లో నటనకు నేషనల్ అవార్డులు గెలిచింది ఇద్దరు మాత్రమే.

అందులో ఒకరు ఊర్వశి శారద. ఆమె 1978లో ‘నిమజ్జనం’ అనే సినిమాకు జాతీయ ఉత్తమనటిగా ఎంపికైంది. ఆమె ఇంకో రెండుసార్లు అవార్డు గెలిచారు కానీ.. అవి మలయాళ సినిమాలకు అందుకున్నవి. ఇక అర్చన 1988లో ‘దాసి’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది. ఆమె కూడా తమిళంలో మరో సినిమాకు అవార్డు అందుకుంది. తెలుగు వాళ్లయిన శ్రీదేవి, లక్ష్మి, సుహాసిని వేరే భాషల సినిమాలకు అవార్డులందుకున్నారు. మనకు బాగా పరిచయం ఉన్న పరభాషా నటీమణులు టబు, శోభన, ప్రియమణి జాతీయ అవార్డులు సాధించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English