మహేష్ టీం.. ఏం కవర్ డ్రైవ్ ఆడిందిలే

మహేష్ టీం.. ఏం కవర్ డ్రైవ్ ఆడిందిలే

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్.. ఇటీవల తగ్గిన జీఎస్టీ పన్నుకు అనుగుణంగా టికెట్ల రేట్లు తగ్గించకపోవడాన్ని గుర్తించి అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రూ.100కు పైగా రేటున్న టికెట్లపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 18 శాతానికి తగ్గించింది.

ఈ మేరకు ఏఎంబీ సినిమాస్‌లో రూ.200గా ఉన్న సాధారణ తరగతి టికెట్ రేటును రూ.180కి తగ్గించాలి. కానీ యాజమాన్యం నిబంధనల్ని పట్టించుకోకుండా కొన్ని వారాలుగా యధావిధిగా రేట్లను కొనసాగిస్తోంది. దీని వల్ల ప్రేక్షకుల నుంచి రూ.35 లక్షలకు పైగా అదనపు వసూళ్లు చేసినట్లు స్పష్టమైంది. దీనిపై మీడియాలో పెద్ద చర్చ నడిచేసరికి యాజమాన్యం అప్రమత్తమైంది. అక్రమంగా వసూలు చేసిన రూ.35 లక్షల మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి ఇవ్వడానికి ముందుకొచ్చింది.

ఐతే తప్పు ఒప్పుకుని డబ్బులు వెనక్కి ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ దీని గురించి మీడియాకు ఇచ్చిన స్టేట్మెంటే విడ్డూరంగా ఉంది. ప్రేక్షకుల నుంచి అక్రమంగా వసూలు చేసిన అనడానికి బదులు.. ప్రేక్షకుల నుంచి అదనంగా వచ్చిన అనే మాట వాడారు. తర్వాత ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి ఇచ్చినందుకు మహేష్ బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించినట్లుగా పేర్కొన్నారు. మహేష్ బాబు, సునీల్ నారంగ్ తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు కమిషనరేట్ అభినందించినట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఇలా ఎవ్వరూ జీఎస్టీని వెనక్కి తిరిగివ్వలేదని.. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారని.. ఈ నిర్ణయం ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరులోని థియేటర్ల యజమానులపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొన్నారని.. సూపర్ స్టార్ ఏ విషయంలో అయినా సూపర్ స్టారే అని మరోసారి రుజువైందని.. ఇలా ఈ ప్రెస్ నోట్లో మహేష్ బాబును ఆకాశానికెత్తే పని బలంగానే చేశారు. ఒక దొంగ దొరికిపోయాక తాను దొంగిలించిన మొత్తం వెనక్కి తెచ్చిస్తే అదొక అద్భుత విషయం అని ఎక్కడైనా అంటామా? హుందాగా తప్పుచేశాం.. సరిదిద్దుకున్నాం అని చెప్పకుండా ఇలా కవర్ డ్రైవ్ ఆడటంతో మహేష్ మరింతగా ట్రోల్ అవుతున్నాడు సోషల్ మీడియాలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English