మణికర్ణిక ట్రైలర్ లాంచ్.. క్రిష్ లేకుండానే

మణికర్ణిక ట్రైలర్ లాంచ్.. క్రిష్ లేకుండానే

బ్రిటిష్ వారితో అలుపెరగని పోరాటం జరిపిన వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి కథతో తెరకెక్కిన హిందీ సినిమా ‘మణికర్ణిక’. మన క్రిష్ దర్శకత్వంలో మొదలై.. మధ్యలో కంగనా రనౌత్ చేతికి వెళ్లిన ఈ చిత్రం అనేక అడ్డంకుల్ని దాటుకుని పూర్తయింది. విడుదలకూ సిద్ధమైంది. ఈ నెల 25నే ‘మణికర్ణిక’ను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు.

ఇప్పుడు తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగనా రనౌత్ అండ్ టీం హైదరాబాద్‌కు వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన మన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రైలర్ లాంచ్ జరిగింది హైదరాబాద్‌లోనే అయినా.. దర్శకుడు క్రిష్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హిందీలో రిలీజ్ చేసిన వెర్షన్‌నే యాజిటీజ్‌గా ఇక్కడా వదిలారు. ట్రైలర్‌కు తెలుగు డబ్బింగ్ విషయంలో బాగానే జాగ్రత్త తీసుకున్నారు. హిందీ సినిమాల డబ్బింగ్‌ల్లో ఎప్పుడూ వినిపించే వాయిస్‌లే ఇందులోనూ వినిపించాయి. కాకపోతే విజయేంద్ర ప్రసాద్ కొంచెం శ్రద్ధ పెట్టాడో ఏమో తెలియదు కానీ.. ఎక్కడా సంభాషణల్లో తేడా రాకుండా పర్ఫెక్ట్‌గా చేశారు. ఐతే ఇందులో మాటల క్రెడిట్ ప్రసూన్ జోషికి ఇవ్వడం విశేషం. హిందీ డైలాగుల్ని ఉన్నదున్నట్లుగా తర్జుమా చేయడం వల్లేమో.. డైలాగ్స్ క్రెడిట్ ఆయనకే ఇచ్చినట్లున్నారు. హిందీ ట్రైలర్లో మాదిరే దర్శకత్వం టైటిల్ కింద రాధాకృష్ణ జాగర్లమూడి పేరు పైన, కంగనా రనౌత్ పేరు కింద వేశారు. మరోవైపు కంగనా ఇట్నుంచి ఇటే చెన్నైకి కూడా వెళ్లి తమిళ ట్రైలర్ లాంచ్ చేయబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English