హ్యాట్సాఫ్ మెగాస్టార్

హ్యాట్సాఫ్ మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి సాధారణంగా తన ఫ్యామిలీ హీరోల సినిమాల వేడుకలకే వస్తుంటారు. వాళ్ల మీద అంతులేని ప్రేమ చూపిస్తుంటారు. తన ఫ్యామిలీ హీరోల్ని చిరు ఎంత పొగిడినా ఆశ్చర్యమేమీ లేదు. కానీ తాజాగా ఆయన విజయ్ దేవరకొండ సినిమా ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్‌కు వచ్చి అతడి గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా అల్లు అరవింద్ నిర్మించినప్పటికీ.. చిరు ఇలా సక్సెస్ మీట్‌కు వస్తాడని ముందు ఎవరూ అనుకోలేదు. ఇలా రావడమే ఆశ్చర్యమంటే విజయ్ దేవరకొండను పొగిడిన తీరు ఇంకా ఆశ్చర్యకరం. నిజానికి విజయ్ దేవరకొండ రైజ్ చూస్తే టాలీవుడ్లో ఎవరికైనా అసూయ కలగకుండా ఉండదు. ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు కూడా ఇంత వేగంగా ఆ స్థాయి ఫాలోయింగ్ సంపాదించుకున్నది లేదు. ఇక బ్యాగ్రౌండ్ లేకుండా అలాంటి ఫాలోయింగ్ తెచ్చుకోవాలంటే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాలి.

నిజానికి విజయ్ కంటే ముందు ఇలా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా బంపర్ క్రేజ్ తెచ్చుకుని పెద్ద రేంజికి వెళ్లిందంటే మెగాస్టార్ చిరంజీవే. కానీ ఆయన అందుకోసం చాలా ఏళ్లు కష్టపడ్డారు. చాలా కాలం ఎదురు చూశారు. ఇదే విషయాన్ని చిరు ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్లోనూ ప్రస్తావించారు. చాలా ఏళ్లు కష్టపడి 30 సినిమాలు చేశాక ‘ఖైదీ’తో తనకు స్టార్ ఇమేజ్ వచ్చిందని.. కానీ విజయ్ హీరోగా మూడో సినిమాతోనే స్టార్ అయిపోయాడని అన్నాడు. ఈ విషయంలో చిరు ఏమాత్రం ఇగో లేకుండా మాట్లాడటం గొప్ప విషయమే. అంతే కాదు.. తన ఫ్యామిలీలోనే కొందరు హీరోలు చాలా స్ట్రగుల్లో ఉండగా.. ఇంకొందరు ఎంతో కష్టపడి స్టార్లుగా ఎదగగా.. చిరు ఆ విషయాలేమీ దృష్టిలో ఉంచుకోకుండా విజయ్‌ను మనస్ఫూర్తిగా ప్రశంసించడం.. అతడిని ఇమిటేట్ చేస్తూ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలకు నటనలో వైవిధ్యం చూపించిన తీరును కొనియాడటం ఆయన ప్రత్యేకతను చాటిచెప్పాయి. అందుకే ఈ ప్రసంగం విన్న వాళ్లందరూ హ్యాట్సాఫ్ మెగాస్టార్ అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు