ఫ్లాప్ జోడీని రిపీట్ చేస్తున్నారు

ఫ్లాప్ జోడీని రిపీట్ చేస్తున్నారు

అన్ని సార్లూ హిట్ పెయిర్స్ మాత్రమే కాదు.. ఫ్లాప్ జోడీలు కూడా రిపీటవుతుంటాయి. ప్రభుదేవా-తమన్నా కాంబినేషన్ కూడా ఇలాగే రిపీట్ చేయబోతున్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ కలిసి ‘అభినేత్రి’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళం.. హిందీ భాషల్లో కూడా రూపొందించారు. మూడు భాషల్లోనూ ఫ్లాపే అయింది ఆ చిత్రం. ఎ.ఎల్.విజయ్ ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో సీనియర్ నటుడు పార్తీబన్ ఓ ద్విభాషా చిత్రం తీయబోతున్నాడట. పార్తీబన్ మంచి నటుడే కాదు.. గొప్ప దర్శకుడు కూడా. అతడి నుంచి గొప్ప గొప్ప సినిమాలొచ్చాయి గతంలో. ఐతే చాలా ఏళ్లుగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టి ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఈ చిత్రానికి ప్రభుదేవా, తమన్నాలను హీరో హీరోయిన్లుగా ఎంచుకున్నాడు. ముందు డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయమై.. ఆ తర్వాత నటుడిగా మారిన ప్రభుదేవా చివరగా దర్శకత్వం కూడా చేపట్టాడు. దర్శకుడిగా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన ప్రభు.. కొన్నేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నాడు. కానీ రెండేళ్లుగా మళ్లీ నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ‘అభినేత్రి’ దర్శకుడు విజయ్ డైరెక్షన్లో ప్రభు నటించిన ‘లక్ష్మి’ విడుదలకు సిద్ధమవుతోంది. అది డ్యాన్స్ నేపథ్యంలో సాగే సినిమా. వచ్చే నెలలోనే ఈ చిత్రం విడుదలవుతుంది. ఇలా నటుడిగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా ఓ మెగా ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేస్తున్నాడు ప్రభు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా అతను ‘దబాంగ్-3’ చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English