మహేష్ బావకు మాట పడిపోయింది

మహేష్ బావకు మాట పడిపోయింది

నిన్నటి తరం సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. నేటితరం సూపర్ స్టార్ బావగా.. పెద్ద బ్యాకప్‌తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. ఐతే కెరీర్లో ఇంకా అతడు ఆశించిన స్థాయి సినిమా పడలేదు. ‘ప్రేమ కథా చిత్రమ్’ పెద్ద హిట్టయినా దాని వల్ల అతడికి పెద్దగా పేరు రాలేదు. పేరు తెచ్చిన సినిమాలేవీ కమర్షియల్‌గా ఆడలేదు.

ఇప్పుడతడి ఆశలన్నీ ‘సమ్మోహనం’ మీదే ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి విలక్షణ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించడంతో దీనిపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. దీని ప్రోమోలు కూడా అంచనాలు పెంచాయి. అలాంటి దర్శకుడితో పని చేయడం పట్ల.. ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో సుధీర్ చాలా ఎమోషనల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ‘సమ్మోహనం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆ ఉద్వేగాన్నంతా చూపించాడు సుధీర్.

ముందు మహేష్ గురించి మాట్లాడటం మొదలుపెట్టి.. గడ్డంతో ఉన్న అతడి న్యూ లుక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సుధీర్.  ఆ తర్వాత ‘సమ్మోహనం’ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అనుభవం గురించి చాలా మాట్లాడాలనుకున్నానని.. కానీ ఇప్పుడు మాటలు రావట్లేదని అన్నాడు సుధీర్. తనను ఈ చిత్రానికి హీరోగా ఎంచుకున్నందుకు ఇంద్రగంటికి రుణపడి ఉంటానన్న సుధీర్.. వెంటనే ఆయన దగ్గరికెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగించలేక మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయాడు.

తర్వాత ఇంద్రగంటి మైక్ తీసుకుని.. నువ్వు తమ సినిమాలోని ఒక ఎమోషనల్ సీనే ఇక్కడ చూస్తున్నట్లుగా ఉంది అన్నాడు. ప్రసంగం కొనసాగించాలని ఇంద్రగంటి అన్నా సుధీర్ నా వల్ల కాదనేశాడు. సుధీర్ ‘బాగి’ లాంటి సినిమాల్లో కండలతో కనిపించి ఉండొచ్చని.. కానీ నిజానికి అతడిది చాలా సున్నిత మనస్తత్వమని.. అందుకే ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడని చెప్పాడు. తాను పని చేసిన వాళ్లలో అత్యంత నచ్చిన నటుల్లో సుధీర్ ఒకడని.. అతడిని చూసి తాను గర్విస్తున్నానని.. ఇది నిజాయితీగా చెబుతున్న మాట అని ఇంద్రగంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు