శర్వా.. ఫ్లాప్ డైరెక్టర్ల దేవుడు

శర్వా.. ఫ్లాప్ డైరెక్టర్ల దేవుడు

ఏ ఫీల్డులో అయినా అందరూ సక్సెస్ చుట్టూనే తిరుగుతారు. అందులోనూ సక్సెస్ రేట్ తక్కువగా ఉండే సినీ పరిశ్రమలో విజయం చుట్టూ తిరిగేవాళ్లే ఎక్కువ. టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలామంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తుంటాడు. కానీ కొద్దిమంది మాత్రమే దర్శకుల ట్రాక్ రికార్డు చూడకుండా కలిసి పని చేయడానికి ముందుకొస్తుంటారు. శర్వానంద్ ఆ కోవలోని వాడే. అతను ఎక్కువగా విజయాల్లో లేని దర్శకులతో జతకట్టి హిట్లు కొట్టడం గమనించవచ్చు. శర్వా చివరి సినిమా ‘మహానుభావుడు’కు ముందు మారుతి తీసిన ‘బాబు బంగారం’ ఫ్లాప్ అయింది. అయినా మారుతిని నమ్మాడు.

ఇక శర్వా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ని రూపొందించిన సతీశ్ వేగేశ్న అంతకుముందు తీసిన రెండు సినిమాలూ ఫ్లాపులే. ప్రస్తుతం శర్వా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ తీస్తున్న హను రాఘవపూడి కూడా ‘లై’తో పెద్ద ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. శర్వా నటిస్తున్న మరో సినిమాకు దర్శకుడైన సుధీర్ వర్మ కూడా విజయాల్లో లేడు. ఇప్పుడు శర్వా.. మరో ఫ్లాప్ డైరెక్టర్‌తో జట్టు కట్టడానికి రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు. ‘బ్రహ్మోత్సవం’తో టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటైన సినిమాను ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రం తర్వాత అడ్డాలకు అవకాశమిచ్చేవాళ్లే కరవయ్యారు. అతడితో సినిమా చేయడానికి భయపడ్డారు.

ఐతే గీతా ఆర్ట్స్ అతడితో సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాగా.. ఆ చిత్రానికి శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రంలో మరో హీరో కూడా ఉంటాడని అంటున్నారు. అతనెవరో చూడాలి. ‘బ్రహ్మోత్సవం’ సంగతెలా ఉన్నా అడ్డాల ఓ విభిన్నమైన దర్శకుడు. మంచి ఉద్దేశాలున్నవాడు. తన ప్రతి సినిమాతో ఏదో ఒక మంచి చెప్పాలని.. కొత్తగా ఏదో చేయాలని ట్రై చేస్తుంటాడు. కానీ ఈ క్రమంలో ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్లిపోతుంటాడు. ఈసారి అలాంటి లోపాల్లేకుండా ఒక మంచి, జనరంజకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాడని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English