‘రంగస్థలం’కు తలపోటు తప్పదా?

‘రంగస్థలం’కు తలపోటు తప్పదా?

తెలుగు సినిమా నిర్మాతలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్పీలు) మధ్య గొడవ ముదిరింది. ఇరు వర్గాల మధ్య చర్చలు ఫలించలేదు. మార్చి 2 నుంచి థియేటర్లను మూసేయడానికే నిర్ణయించుకున్నారు. తెలుగు నిర్మాతలకు సంఘీభావంగా దక్షిణాదిన మిగతా పరిశ్రమలు కూడా కలిసొస్తున్నాయి. సమ్మె ఆషామాషీగా ఏమీ ఉండదని.. డీఎస్పీలు దిగొచ్చి నామమాత్రపు ధరకు ప్రొజెక్టర్లను అద్దెకిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు.

ఐతే డీఎస్పీల ఆలోచన మరోలా ఉంది. మార్చి తొలి రెండు మూడు వారాల్లో కలెక్షన్లు నామమాత్రంగా ఉంటాయి కాబట్టే ఇలా సమ్మెకు దిగుతున్నారని.. ఇప్పుడు తాము తలొగ్గితే నిర్మాతలు చెప్పినట్లే నడుచుకోవాల్సి ఉంటుందని.. కాబట్టి తగ్గొద్దని.. మార్చి నెలాఖరుకు నిర్మాతలే రాజీకి వస్తారని అంటున్నారు. మార్చి చివరి వారంలో ‘రంగస్థలం’ లాంటి భారీ సినిమా విడుదల కావాల్సి ఉందని.. ఆ తర్వాత ప్రతి వారానికి పెద్ద సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయని.. ఒక్క సినిమా వాయిదా పడినా మిగతా షెడ్యూళ్లన్నీ మారిపోతాయి కాబట్టి నిర్మాతలు కాంప్రమైజ్ కాక తప్పదు అన్నది వాళ్ల ఆలోచన. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మార్చి తొలి రెండు వారాల్లో ఏం జరుగుతుంది.. ఇరు వైపుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నదానిపై అందరి దృష్టీ నెలకొంది. ఈ లోపు సమస్య పరిష్కారం కాని పక్షంలో ముందుగా ఇబ్బంది ఎదురయ్యేది ‘రంగస్థలం’ సినిమాకే. దాని కంటే ముందు షెడ్యూల్ అయిన సినిమాల్ని వాయిదా వేసినా ఇబ్బంది లేదు. కానీ ‘రంగస్థలం’ను వాయిదా వేయడమే కష్టం. దాని డేటు మారితే మిగతా సినిమాల షెడ్యూళ్లన్నీ డిస్టర్బ్ అవుతాయి. అసలు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’ కోసమని వాయిదా వేశారు. ఇప్పుడు చూస్తే ఈ కొత్త తలనొప్పి మొదలైంది. మరి ఈ సినిమా భవితవ్యం ఏమవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు