ఆ సినిమా క్యాన్సిలైంది.. ఈ కథ పుట్టింది

ఆ సినిమా క్యాన్సిలైంది.. ఈ కథ పుట్టింది

కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసాండ్రా, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా లాంటి భారీ తారాగణం.. నాని, రవితేజల వాయిస్ ఓవర్.. ఇంకా నిర్మాత కూడా నానీనే.. ఒక కొత్త దర్శకుడి తొలి సినిమాకు ఇంతకంటే మంచి సపోర్ట్ ఇంకెక్కడ దొరుకుతుంది? ‘అ’ సినిమాతో ఇలాంటి అద్భుత అవకాశమే దక్కించుకున్నాడు ప్రశాంత్ వర్మ.

తన సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా అడగడానికి నానీని కలిస్తే.. ఏకంగా సినిమా నిర్మించడానికే తయారైపోయాడు నాని. రాజీ లేకుండా సినిమా ప్రొడ్యూస్ చేయడమే కాదు.. దాన్ని చక్కగా ప్రమోట్ చేస్తూ కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చాడు నేచురల్ స్టార్. ఈ జర్నీ ఊహించనిదని.. అసలు ఈ కథ పుట్టిన తీరు కూడా అనూహ్యమని అంటున్నాడు ప్రశాంత్ వర్మ.

కొన్నేళ్ల కిందటే ప్రశాంత్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేయాల్సిందట. ఐతే తనతో సినిమా చేయడానికి అంగీకరించిన నిర్మాతలు.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడంతో తాను నిరాశలో పడ్డట్లు అతను వెల్లడించాడు. ఈ ఫ్రస్టేషన్లో 2016 డిసెంబరు 31న రాత్రి పార్టీ కూడా క్యాన్సిల్ చేసుకున్నానని.. తాను అలా ఫ్రస్టేషన్లో ఉన్న సమయంలోనే ‘అ’ కథ రాయడం మొదలుపెట్టానని.. ఆ తర్వాత ఆ కథతోనే నాని సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడని ప్రశాంత్ వెల్లడించాడు.

‘అ’ లాంటి సినిమా తెలుగులో ఇప్పటిదాకా రాలేదని.. ప్రతి పది నిమిషాలకు ఇందులో జానర్ మారిపోతుందని.. ఇది ఫలానా జానర్ అని చెప్పలేమని.. హార్రర్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, కామెడీ.. ఇలా అనేక రకాల జానర్ల కలయికతో ఈ సినిమా తెరకెక్కిందని అతను చెప్పాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు