దువ్వాడ అక్కడ బ్లాక్ బస్టరే..

దువ్వాడ అక్కడ బ్లాక్ బస్టరే..

 ఏడాది వేసవి చివర్లో విడుదలైన అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’కు అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. చాలా మామూలు కథతో తెరకెక్కిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది.

కంటెంట్ పరంగా అయితే ఇది చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు. కానీ ఇలాంటి సినిమా టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు రేటింగ్స్ అదిరిపోయాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే అక్కడ ఊహించని స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతోనే ఈ చిత్రాన్ని అనువాదం చేసి.. మొన్న రాత్రి యూట్యూబ్‌లో లాంచ్ చేశారు.

ఆదివారం రాత్రి 10 గంటలకు ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లోకి వస్తే.. మంగళవారం మధ్యాహ్నానికే వ్యూస్ 94 లక్షలకు చేరుకోవడం విశేషం. లైక్స్ 1.1 లక్షలు దాటాయి. దీని కంటే ముందు యూట్యూబ్‌లో రిలీజైన అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు’ హిందీ వెర్షన్ ఏకంగా 10 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకుని రికార్డు నెలకొల్పింది. అది కూడా మామూలు కమర్షియల్ సినిమానే అయినా.. వ్యూస్ మోతెక్కిపోయాయి.

గత కొన్నేళ్లలో తెలుగు నుంచి హిందీలోకి డబ్ అవుతున్న హిందీ సినిమాలకు ఇలాగే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. మాస్ మసాలా సినిమాలకే అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా పట్టం కడుతున్నారు. హిందీలో ఈ తరహా సినిమాలు తక్కువైపోవడం కూడా అందుకు కారణం కావచ్చు. ‘రెబల్’ లాంటి డిజాస్టర్ మూవీకి కూడా హిందీలో కోట్లల్లో వ్యూస్ రావడం విశేషం. మన సినిమాలకు హిందీ ఛానెళ్లలో రేటింగ్స్ కూడా ఊహించని విధంగా ఉంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు