నాగచైతన్య కోసం ఇంకో దర్శకుడు..

నాగచైతన్య కోసం ఇంకో దర్శకుడు..

ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్‌ లాంటి వారసుల్లా పెద్ద మాస్ హీరోగా ఎదగకపోయినప్పటికీ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు అక్కినేని నాగచైతన్య. టాలీవుడ్లో ఎవరైనా దర్శకుడు మంచి ప్రేమకథ రాసుకుంటే ఇప్పుడు చైతూ వైపే చూస్తున్నాడు. ప్రేమకథలతో అంత మంచి పేరు సంపాదించాడతను.

‘ఉయ్యాల జంపాల’.. ‘మజ్ను’ లాంటి లవ్ స్టోరీలతో మెప్పించిన విరించి వర్మ కూడా తన తర్వాతి సినిమాను చైతూతోనే చేయాలనుకుంటున్నాడు. అతను ఓ మంచి ప్రేమకథతో అక్కినేని నాగార్జునను కలిసి మెప్పించినట్లు సమాచారం. విరించి తొలి సినిమాను నిర్మించిన నాగ్.. ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

గత సినిమా ‘యుద్ధం శరణం’ బోల్తా కొట్టినప్పటికీ చైతూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ని మొదలుపెట్టిన అతను.. దీంతో పాటుగానే మారుతితో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేయాల్సి ఉంది. మరోవైపు తన మావయ్య విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు విరించితో కూడా సినిమా ఓకే చేసేశాడు.

కాకపోతే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి కొంచెం సమయం పట్టొచ్చు. విరించి రెండో సినిమా ‘మజ్ను’ పర్వాలేదనిపించింది కానీ.. అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో స్క్రిప్టు మరింత పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలని నాగ్ అతడికి సూచించాడట. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English