రూ.10 కోట్లు పెట్టు.. 3 రెట్లు పట్టు

రూ.10 కోట్లు పెట్టు.. 3 రెట్లు పట్టు

ఈ ఏడాది దిల్ రాజు ఊపు మామూలుగా లేదు. ఏడాది ఆరంభంలో సంక్రాంతికి రిలీజైన ఆయన సినిమా ‘శతమానం భవతి’ ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెట్టుబడి మీద మూడు రెట్ల దాకా వసూలు చేసి పెట్టిందా సినిమా. రూ.10 కోట్లకు అటు ఇటు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.35 కోట్ల దాకా షేర్ వసూలు చేయడం విశేషం.

ఇటు నిర్మాతగా దిల్ రాజు.. అటు బయ్యర్లు ఫుల్ ఖుషీ అయ్యారు ‘శతమానం భవతి’తో. ఇక ‘శతమానం..’ వచ్చిన నెల రోజుల్లోపే ‘నేను లోకల్’తో మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు రాజు. ఆ చిత్రం పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువే వసూలు చేసింది. రాజుకు, బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక గత నెలలో రాజు నుంచి వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రాజు సేఫ్ అయినప్పటికీ బయ్యర్లు మాత్రం దెబ్బ తిన్నారు. కానీ రాజు నుంచి వచ్చిన కొత్త సినిమా ‘ఫిదా’ మాత్రం ఆయనకు మళ్లీ భారీగా లాభాలు తెచ్చిపెట్టేలాగే ఉంది. ఈ సినిమా కూడా రూ.10 కోట్లకు అటు ఇటు బడ్జెట్లోనే తెరకెక్కింది. తొలి వారాంతంలోనే ఈ చిత్రం రూ.14 కోట్ల దాకా షేర్.. రూ.25 కోట్లకు పైగా గ్రాస్ తెచ్చిపెట్టింది.

వీక్ డేస్‌లో కూడా సినిమా అదరగొడుతుండటం.. అన్ని ఏరియాల్లోనూ థియేటర్ల సంఖ్య పెరగడంతో ఫుల్ రన్లో ఈజీగా రూ.30 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో సోమవారానికే మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం 2 మిలియన్ మార్కును కూడా టచ్ చేస్తే ఆశ్చర్యం లేదు. పెట్టుబడి మీద రెట్టింపు రాబడితో రాజు మళ్లీ ఖుషీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బయ్యర్లు కూడా భారీ లాభాలు అందుకోబోతున్నారు. మొత్తంగా ‘ఫిదా’ అందరినీ ఫిదా చేసేలాగే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు