అబ్బే... ప్రభాస్‌కి ఇది సరిపోదమ్మా

అబ్బే... ప్రభాస్‌కి ఇది సరిపోదమ్మా

ప్రభాస్‌ మలి చిత్రం 'సాహో'ని కూడా జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాహుబలితో వచ్చిన ఊపు తగ్గిపోకుండా, ప్రభాస్‌ని జాతీయ స్టార్‌గా నిలబెట్టడానికి యువి క్రియేషన్స్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. రాజమౌళి ముద్ర లేకుండా ప్రభాస్‌ సినిమాకి దేశమంతటా క్రేజ్‌ రావడం అంత ఈజీ కాదు. అందుకే దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన నటీనటుల్ని తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇందులో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ని తీసుకున్నారట. తమిళంలో 'కత్తి'లో విలన్‌గా చేసిన నీల్‌ నితిన్‌కి హిందీలో మంచి గుర్తింపే వుంది. అయితే నీల్‌ నితిన్‌ని పెట్టుకోవడం వల్ల అటు హిందీ, ఇటు తమిళ వెర్షన్స్‌కి అదనంగా వచ్చే లాభం ఏమీ వుండదు. ఉదాహరణకి '2.0'లో రజనీకాంత్‌కి విలన్‌గా అక్షయ్‌కుమార్‌ని పెట్టారు. అక్షయ్‌ అనే సరికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా క్రేజీ ఫ్యాక్టర్‌ అవుతాడు.

అతడే బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌ కనుక అతను విలన్‌ కావడం వల్ల '2.0'కి నార్త్‌లో చాలా బెనిఫిట్‌ వుంటుంది. నీల్‌ నితిన్‌తో అలాంటి క్రేజ్‌ రావడం కష్టం. ఇదిలావుంటే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ని పెట్టుకుందామని చూస్తున్నా అదీ జరగడం లేదట. చివరకు అక్కడి ద్వితీయ శ్రేణి హీరోయిన్‌ ఎవరితోనో సరిపెట్టుకోవాల్సి వచ్చేలాగుంది.

బాహుబలితో ప్రభాస్‌కి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ ఇంకా అతడితో నటించడం కోసం బాలీవుడ్‌ ఏ గ్రేడ్‌ నటీమణులు తహతహలాడిపోయేంత స్టార్‌డమ్‌ అయితే రాలేదని ఇది తెలియజెప్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు