టీజర్ బాగుంది కానీ.. హీరోనే

టీజర్ బాగుంది కానీ.. హీరోనే

కొన్ని నెలల కిందట అక్కినేని అఖిల్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేసి.. అందులో ముసుగుతో ఉన్న హీరో గురించి ట్వీట్ చేయడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ‘వీడెవడు’ అనే టైటిల్‌తో ఉన్న ఆ పోస్టర్లో ఆ హీరో ఎవరబ్బా అని అంతా ఆసక్తిగా చూశారు. చివరికి ఆ హీరో సచిన్ జోషి అని తెలిశాక నిట్టూర్చారు. అవ్వడానికి ముంబయి వాడైనా.. తెలుగులో ఓ వెలుగు వెలిగిపోవాలని ఇప్పటికే ఐదారు సినిమాలు చేసిన సచిన్.. ఇప్పటిదాకా మన ప్రేక్షకుల్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఐతే అతను ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ‘వీడెవడు’ కొంచెం బెటర్‌గానే కనిపిస్తోంది. తాజాగా రిలీజైన టీజర్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది.

పోలీసులతో ఆటాడుకునే క్రిమినల్ మైండెడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు సచిన్ ఇందులో. ఓ అమ్మాయి కనిపించకుండా పోవడంతో అతడి బాయ్ ఫ్రెండ్‌ అయిన సచిన్‌ను పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేస్తాడు ఓ పోలీస్. ఆ పోలీస్ వేసే ప్రశ్నలకు ఇంటరాగేషన్లో తింగరి సమాధానాలిస్తుంటాడు సచిన్. ముందు మామూలోడిగా కనిపించిన అతడు.. ఆ తర్వాత తనలోని మరో యాంగిల్ చూపిస్తాడు. టీజర్ చూస్తే ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లాగే కనిపిస్తోంది. బాలీవుడ్ భామ ఇషా గుప్తా ఇందులో సచిన్‌కు జోడీగా నటించడం విశేషం. ఆమె ఈ సినిమాలో బాగానే అందాలు ఆరబోసిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సినిమా కూడా మంచి క్వాలిటీతో తెరకెక్కినట్లుంది.

అంతా బాగుంది కానీ.. ఇందులో హీరోగా సచినే సరిగా ఫిట్ అయినట్లు లేడు. ఒక ఇమేజ్ ఉన్న హీరో చేస్తే బాగుండేదనిపిస్తోంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లకు అతనేమాత్రం సెట్టవుతాడా అన్నది డౌట్. సచిన్ యాక్టింగ్ స్కిల్స్ ఏంటో ఇంతకుముందే చూశాం. అతనీ క్యారెక్టర్‌ను ఏమాత్రం పండించాడో అన్న సందేహాలు కలుగుతున్నాయి. భీమిలి కబడ్డీ జట్టు.. ఎస్ఎంఎస్ లాంటి రీమేక్ సినిమాల్ని డైరెక్ట్ చేసిన తాతినేని సత్య తొలిసారి తన సొంత కథతో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. ‘వీడెవడు’కు నిర్మాత కూడా సచిన్ జోషినే. ఈ చిత్రం తమిళంలోనూ ఒకేసారి విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు