నాని సినిమాను సయామీ కన్ఫర్మ్ చేసింది

నాని సినిమాను సయామీ కన్ఫర్మ్ చేసింది

మణిరత్నం అంటే నానికి పిచ్చి అభిమానం. 'ఓకే బంగారం' సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌కు డబ్బింగ్‌ చెప్పాడని.. ఆ సందర్భంగా మణిరత్నంతో కలిసి పని చేశాడు కాబట్టి ఆ సందర్భంలో ఈ మాట అన్నాడేమో అనుకోకండి. దానికి ముందు తర్వాత కూడా సందర్భం వచ్చినపుడల్లా మణిరత్నం తన ఫేవరెట్‌ డైరెక్టర్‌ అని చెబుతుంటాడు నాని. 'ఓకే బంగారం'కు డబ్బింగ్‌ చెప్పినందుకే కిందా మీదా అయిపోయాడు నాని.

ఆ తర్వాత ఏకంగా మణిరత్నంతో సినిమా చేసే అవకాశమే రావడంతో ఉబ్బితబ్బిబ్బపోయాడు. ఇది తనకు లైఫ్‌ టైం ఛాన్స్‌ అంటూ పొంగిపోయాడు. కానీ ఈ సినిమా మొదలయ్యేట్లే కనిపించి ఆగిపోయింది. నాని, కార్తి, నిత్యామీనన్‌, సయామీ ఖేర్‌ల కాంబినేషన్లో ఈ సినిమా తీయాలనుకుని.. అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గాడు మణి. ఆ తర్వాత కార్తితో 'కాట్రు వేలదిల్లై' సినిమాను మొదలుపెట్టాడు. దీంతో మణిరత్నంతో నాని సినిమా ఉండదనే అనుకున్నారంతా.

ఐతే 'రేయ్‌' ఫేమ్‌ సయామీ ఖేర్‌ మాత్రం ఈ సినిమా ఆగిపోలేదని అంటోంది. కొన్ని కారణాల వల్ల మణిరత్నం ఈ సినిమాను తాత్కాలికంగా పక్కనబెట్టి వేరే ప్రాజెక్టుపై దృష్టిపెట్టారని.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశముందని.. మణిరత్నం తనతో టచ్‌లోనే ఉన్నాడని సయామీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కాబట్టి వచ్చే ఏడాదైనా నాని.. మణిరత్నం దర్శకత్వంలో నటించడం ఖాయమేనన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English