సినిమా రివ్యూ: డైనమైట్‌

సినిమా రివ్యూ: డైనమైట్‌

సినిమా రివ్యూ: డైనమైట్‌
రేటింగ్‌: 3.25/5
తారాగణం: విష్ణు, ప్రణీత తదితరులు
సంగీతం: అచ్చు
కెమెరా: సతీష్‌ ముత్యాల
ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
నిర్మాత: మంచు విష్ణు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవ కట్టా

తమిళంలో విజయవంతమైన 'అరిమనంబి' చిత్రానికి రీమేక్‌ ఇది. ఎక్కువ కామెడీ చిత్రాలు చేస్తోన్న విష్ణు తన స్టయిల్‌ మార్చి ఇందులో పూర్తిస్థాయి యాక్షన్‌ హీరోగా అవతారమెత్తాడు. విష్ణు గడ్డంతో, టాటూతో చాలా కొత్తగా కనిపించాడు. ఈ చిత్రం కోసమనే బాడీ కూడా బిల్డ్‌ చేశాడు. ఇంతకుముందు అన్నీ ఒరిజినల్‌ మూవీస్‌ తీసిన దేవ కట్టా ఈ రీమేక్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. విష్ణు వన్‌ మాన్‌ షో ప్రదర్శించిన ఈ చిత్రం ఫుల్‌ డీటెయిల్స్‌లోకి వెళితే...

కథ:    

శివాజీ (విష్ణు), అనామిక (ప్రణీత) డేట్‌కి వెళతారు. రెస్టరెంట్‌ నుంచి అనామిక ఫ్లాట్‌కి వచ్చిన కాసేపటికి ఆమె కిడ్నాప్‌ అవుతుంది. అనామిక వివరాల కోసమని ఆమె ఇంటికి వెళితే అక్కడో వీడియో కోసమని ఆమె తండ్రిని చంపేయడాన్ని శివాజీ చూస్తాడు. ఎలాగైనా ఆమెని కాపాడాలని వెళతాడు. ఆ వీడియో చాలా పవర్‌ఫుల్‌ వ్యక్తికి సంబంధించిన చీకటి కోణాన్ని చూపించేది కావడంతో శివాజీ, అనామిక ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ సమస్యనుంచి వారు ఎలా బయటపడ్డారనేదే కథ.

కథనం:

బిగి సడలని కథనంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. కథాపరంగా చెప్పుకోతగ్గ విశేషాలేం లేవు. కానీ కథనం కదలకుండా కట్టి పడేస్తుంది. సినిమా మొదలవడం తాపీగా మొదలైనా కానీ ఒక పావుగంటలోనే ఆసక్తికరంగా మారుతుంది. అనామికని కిడ్నాప్‌ చేసిన దగ్గర్నుంచి కథనం పరుగులు పెడుతుంది. ఎవరో పెద్ద లెవల్‌కి చెందిన వ్యక్తి దాని వెనుక వున్నాడనేది తెలుస్తుంది కానీ క్లియర్‌ హింట్స్‌ ఇవ్వరు. మొదట్లో అంతా ఎవరు, ఏంటనే ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తుంటాయి.

విలన్‌ ఎవరనేది రివీల్‌ అయిన తర్వాత మైండ్‌ గేమ్స్‌ మొదలవుతాయి. శాటిలైట్‌ ట్రాకింగ్‌, సిసి కెమెరాలు, ఇంటర్నెట్‌ ఐపీల ద్వారా అడ్రస్‌ కనుక్కోవడం వగైరా టెక్నికల్‌ అంశాలతోనే సినిమా రసవత్తరంగా మారుతుంది. ప్రథమార్థం వేగంగా సాగినా కానీ ఆసక్తికరమైన అంశాలు తక్కువ. ద్వితీయార్థంలో యాక్షన్‌ ఎక్కువ ఉంటుంది. తద్వారా ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

యాక్షన్‌ సినిమా ప్రియులని ఆకట్టుకునే డైనమైట్‌ కోసం విష్ణు చాలా కష్టపడ్డాడు. రిస్కీ స్టంట్స్‌ చేసి యాక్షన్‌ సీన్స్‌ ఉత్కంఠ కలిగించేలా చేసాడు. ఈ చిత్రంలో పాటల అవసరం లేదు. వేగంగా సాగిపోతున్న కథనంలో పాటలు స్పీడ్‌ బ్రేకర్లలా అడ్డు పడ్డాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసమని పాటల్ని పెట్టినట్టున్నారు కానీ ఇలాంటి సినిమాల్లో పాటలే లేకపోతే ప్రేక్షకులు పూర్తిగా లీనమైపోతారు.

క్లయిమాక్స్‌ సీన్‌ చాలా సాధారణంగా అనిపిస్తుంది. తమిళ చిత్రానికి మార్పులు చేసారు కానీ అందులోని బలహీనతలు కవర్‌ చేసే ప్రయత్నం జరగలేదు. అయితే కథనం వేగంగా సాగిపోతుంది కనుక వీక్‌నెస్‌లు కనిపించలేదు. అన్ని వర్గాల వారికి నచ్చకపోవచ్చు కానీ యాక్షన్‌ ప్రియులని మాత్రం బాగానే అలరిస్తుంది.

నటీనటులు:

విష్ణు యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా పండించాడు. ప్రణీత గ్లామరస్‌గా వుంది. ఆమె గ్లామర్‌ మాస్‌ని ఆకట్టుకుంటుంది. జెడి చక్రవర్తి నటన బాగుంది. పతాక సన్నివేశాల్లో అతని నటన మెప్పిస్తుంది. యోగ్‌ జపీ ఫర్వాలేదనిపించాడు. రాజా రవీంద్ర ఓకే. లేఖా వాషింగ్టన్‌ అతిథి పాత్రలో కనిపించింది.

సాంకేతికవర్గం:

దేవ కట్టా ఇంతకుముందు తీసిన చిత్రాలకి భిన్నమైన అంశాలున్న చిత్రమైనా కానీ బాగా హ్యాండిల్‌ చేశాడు. తమిళ వెర్షన్‌ చూడని వారికి ఈ కథనం బాగా నచ్చుతుంది. పాటల అవసరం లేదనిపించినా అచ్చు చేసిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఇంకాస్త మెరుగా వుండాల్సింది. విజయన్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ హైలైట్‌గా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా...

మాస్‌ని, యాక్షన్‌ లవర్స్‌ని ఆకట్టుకునే థ్రిల్లర్‌ ఇది. విష్ణు చేసిన ఇటీవలి చిత్రాల్లో మెరుగైనదీ, మెప్పించేదీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు