అన్న క్యాంటీన్ క‌లెక్ట‌ర్ భోజ‌నం: చంద్ర‌బాబు ఫోన్‌

ఏపీలో కూట‌మి స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అన్న క్యాంటీన్ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. రూ.15 కే మూడు పూట‌లా ఆహారం ల‌భిస్తుండ‌డం.. రుచిగా, శుచిగా ఉండ‌డంతో ఎక్కువ మంది వ్యాపారులు.. హాక‌ర్లు, ఆటో రిక్షా కార్మికులు కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇది సాధార‌ణంగా జ‌రిగే ప‌నే. అస‌లు అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసిందే ఈ ఉద్దేశంతో. అయితే.. ఇప్పుడు ఈ క్యాంటీన్ల‌కు మ‌రింత స్ఫూర్తి నింపింది క‌లెక్ట‌ర్ కుటుంబం. కృష్ణాజిల్లా క‌లెక్ట‌ర్ కుటుంబం సోమవారం మ‌ధ్యాహ్నం.. స్థానిక మ‌చిలీప‌ట్నంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌కు వ‌చ్చి ఆహారం తిన‌డం ఆస‌క్తిగా మారింది.

భార్య‌,కుమార్తెతో క్యాంటీన్‌కు వ‌చ్చిన క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ స్వ‌యంగా రూ.5 టోకెన్లు మూడు తీసుకుని అక్క‌డే భోజ‌నం చేశారు. అయితే.. సాధార‌ణంగా క‌లెక్ట‌ర్లు ఎప్పుడు ఇలా క్యాంటీన్ల‌లో భోజ‌నం చేసింది లేదు. నాయ‌కులు మాత్రం త‌ర‌చుగా వెళ్లడం.. క్యాంటీన్ల‌లో భోజ‌నం చేయ‌డం తెలిసిందే.

అది కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం కోసం వెళ్తార‌నే పేరుంది. కానీ… జిల్లా క‌లెక్ట‌రే స్వ‌యంగా అన్న‌ క్యాంటీన్‌లో భోజ‌నం చేయ‌డంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. ఈ సంద‌ర్భంగా క్యాంటీన్‌కు వ‌చ్చిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కూర‌, సాంబారు రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేస‌మ‌యంలో క్యాంటీన్‌కు పూట‌కు ఎంత మంది వ‌స్తున్నార‌న్న వివ‌రాలు తెలుసుకున్నారు.

ఇదిలావుంటే.. కృష్ణా క‌లెక్ట‌ర్ నేరుగా అన్న క్యాంటీన్‌కువెళ్లి భోజ‌నం చేసిన‌ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు చేరింది. దీంతో ఆయ‌న వెంట‌నే స్పందించారు. క‌లెక్ట‌ర్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయ‌న‌ను అభినందించారు.

త‌ర‌చుగా క‌లెక్ట‌ర్లు క్యాంటీన్ల‌కు వెళ్ల‌డం ద్వారా.. అక్క‌డ మెరుగైన ప‌రిస్థితులు ఏర్ప‌డతాయ‌ని.. ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే తీర్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. డీకే బాలాజీ ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న అభినందించారు. ఈ విష‌యాన్ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పాటించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని కూడా సూచించ‌డం గ‌మ‌నార్హం.