జగన్ ఇంటి వద్ద ప్రైవేటు సైన్యం !

jagan

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ఉపయోగించుకోవడంతో ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జగన్‌ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. దీంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఇన్నిరోజులు ఆంక్షలు ఉండటంతో.. ఇబ్బందులు పడ్డామని, ఆంక్షలు ఎత్తేయడంతో ఇబ్బందులు తీరాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ప్రభుత్వం భద్రతను తగ్గించడం, ఆంక్షలు సండలించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు మాజీ సీఎం జగన్. దీంతో పాటు మాజీమంత్రులు, వైసీపీ నేతలు, కార్యాలయాల మీద దాడులు జరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి సహకారం ఉండదని భావించి తాడేపల్లి నివాసం దగ్గర 30మంది సెక్యూరిటీని సొంతంగా నియమించుకున్నారు.

జగన్ ఇంటి ముందు కొంతమంది, ఇంటి లోపల కొంతమంది రక్షణగా ఉంటూ వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు.

2019 నుంచి మొన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తాడేపల్లి నుంచి అన్ని కార్యక్రమాలు సాగించారు. పార్టీ పరంగా రివ్యూలు, కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకున్నారు జగన్. ఎన్నికల వ్యూహాలు ఇక్కడి నుండే రూపొందించారు. ఎన్నికల్లో ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ ఇంటి దగ్గర భద్రతను భారీగా తగ్గించిన నేపథ్యంలో సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు.