మంత్రి వెలంప‌ల్లికి సొంత సామాజిక వ‌ర్గంలో సెగ‌.. రీజ‌నేంటంటే!

ఏ నిముషానికి ఏమి జ‌రుగునో.. అని పాడుకుంటున్నార‌ట‌.. వైసీపీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు. నిజ‌మే.. రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కే వ‌ర‌కు ఒక తంటా. అవి ద‌క్కిన త‌ర్వాత వాటిని కాపాడుకోవ‌డం మ‌రింత తంటా! ఎటు నుంచి ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చి త‌మ ప‌ద‌వుల‌కు ఎస‌రు పెడుతుందోన‌ని నాయ‌కులు త‌ల్లడిల్లి పోతుంటారు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన మంత్రులు కూడా ఇలానే అనేవారు. మాకు ప‌ద‌వులు ఎప్పుడు ఉంటాయో.. పోతాయో తెలీదు. మీరేమో.. మా గురించి గొప్ప‌గా ఊహించుకుంటారు– అని అప్ప‌ట్లో ఓ మంత్రి మీడియా మిత్రుల‌తో అనేవారు.

అయితే, చిత్ర‌మేంటంటే.. అలా అన్న మంత్రి చివ‌రి వ‌ర‌కు మంత్రిగానే కొన‌సాగారు. కానీ, ఆ మంత్రి మాట‌ల అంత‌రార్థం మాత్రం వాస్త‌వ‌మే! మంత్రి ప‌ద‌విలో ఉన్నామ‌ని ఏమాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా.. ప‌ద‌వీగండం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. మంత్రి వెలంప‌ల్లికి కూడా ఎదుర‌వుతోంద‌ట‌. త‌న కేబినెట్‌లో సోష‌ల్ కెమిస్ట్రీకి పెద్ద‌పీట వేసిన సీఎం జ‌గ‌న్ వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా.. ఉన్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెలంప‌ల్లికి మంత్రి బెర్త్‌ను ఇచ్చారు.

వాస్త‌వానికి ఈ ప‌ద‌విని.. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, వైసీపీలో వెలంప‌ల్లిక‌న్నా సీనియ‌ర్‌, ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఆశించారు. మా కోటాలో నాకే మినిస్ట‌ర్ బెర్త్‌ అని ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు కూడా! అయితే, అనూహ్యంగా రాజ‌కీయ కార‌ణాలు క‌లిసి వ‌చ్చి.. వెలంప‌ల్లికి ఈ అవ‌కాశం వ‌రించింది. దీంతో ఆయ‌న హ‌మ్మ‌య్య అనుకున్నారు. కానీ, రెండు నెల‌లుగా మ‌ళ్లీ ఈయ‌న చింత‌లో చిక్కుకున్నారు. కొన్నాళ్ల కింద‌ట టీడీపీ త‌ర‌ఫున గుంటూరు వెస్ట్ నుంచి విజ‌యం సాధించిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌ను స్వ‌యంగా వెలంప‌ల్లి తీసుకువ‌చ్చి వైసీపీలోకి చేర్పించారు.

మ‌ద్దాలి కూడా వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే. అయితే, ఇప్పుడు ఈయ‌న వ‌ర్గం చిత్ర‌మైన ప్ర‌చారం చేస్తోంద‌ట‌! మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే.. మా నాయకుడికి బెర్త్ ఖాయం అంటూ వెస్ట్‌లో ప్ర‌చారం సాగుతోంది. దీనిపై మ‌ద్దాలి గిరి మౌనంగా ఉన్నారు. కానీ, వెలంప‌ల్లి మాత్రం ఉడికిపోతున్నారు. అరె.. నేనే పార్టీలోకి తెచ్చాను. నా బెర్త్‌కే ఎస‌రు పెడుతున్నాడే! అని కుమిలిపోతున్నార‌ని వెలంప‌ల్లి వ‌ర్గం అంటోంది. మ‌రో ఏడాదిలో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ జ‌రిగే అవ‌కాశంఉంది. ఈ క్ర‌మంలో వెలంప‌ల్లిని త‌ప్పిస్తే.. కోల‌గ‌ట్ల‌కు అవ‌కాశం ద‌క్కాలి.

అయితే, ఈయ‌న‌కు వైసీపీలోనే మ‌రో సీనియ‌ర్ మంత్రి అడ్డుప‌డుతున్నారు. దీంతో ఆయ‌న‌ను ప‌క్క‌న పెడితే.. ఉన్న అవ‌కాశం మ‌ద్దాలి. సో.. ఎటు చూసినా.. వెలంప‌ల్లికి త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనే పోటీ పెరుగుతుండ‌డంతో ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే యాక్టివ్‌గా త‌న ప‌నితాను చేసుకుపోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.