ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత.. పీవీపీ.. పొట్టూరి వరప్రసాద్.. తాజాగా టీడీపీని వీడిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నానిపై సటైర్లు సంధించారు. ఆయనను ‘బోరు కొచ్చిన బండి’ అని వ్యాఖ్యానించారు. నాని.. తాజాగా సీఎం జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
కానీ, పీవీపీ మాత్రం కేశినేని నానిపై సటైర్లు సంధించారు. “బోరు కొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అని ఎక్స్ వేదికగా కామెంట్లు చేశారు. వాస్తవానికి గత ఎన్నికల్లో పీవీపీ వైసీపీ తరఫున విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు.
ఆ ఎన్నికలలో కేశినేనినానిపై పీవీపీ 8 వేల పైచిలుకు ఓట్లతేడాతో ఓడిపోయారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి టికెట్ దక్కించుకునేందుకు పీవీపీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆయన విషయాన్ని పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలావుంటే.. గత నాలుగేళ్లలో ఒకటి రెండు సార్లు మాత్రమే విజయవాడలో కనిపించిన పీవీపీ మెజారిటీ భాగం.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో పీవీపీకి టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీలోనేచర్చ సాగుతోంది. అయినా.. తనవంతు ప్రయత్నాలు పీవీపీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని ఎంట్రీ ఇవ్వడం.. టికెట్ ఆయన తన్నుకు పోవడం ఖాయమని చర్చ సాగుతున్న నేపథ్యంలో పీవీపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates