తెల్లవారితే… రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండి, లక్షలాది ఓట్లను ప్రభావితం చేసే పే రివిజన్ కమిషన్ పై గుడ్ న్యూస్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్‌సీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక వచ్చే వరకు 5 శాతం ‘మధ్యంతర భృతి’ (ఐఆర్) ఉద్యోగులకు ఇవ్వాలని సైతం నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు త్వరలోనే మరిన్ని శుభవార్తలు చెబుతారని మంత్రి హరీశ్‌రావు ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నామని, ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై కసరత్తు చేశారని పేర్కొన్న రెండ్రోజుల తర్వాతే కీలకమైన ఐఆర్, పీఆర్సీపై నిర్ణయం వెలువడటం గమనార్హం. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ ను నియమించారు. సభ్యుడిగా బి.రామయ్యను నియమించారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశిస్తూ నివేదిక వచ్చే వరకు 5 శాతం ఐఆర్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
కాగా, పీఆర్సీలో జాప్యం వల్ల ఉద్యోగుల్లో గులాబీ దళపతి సర్కారుపై అసంతృప్తి నెలకొంది. గులాబీ దళపతి స్వయంగా చేయించుకున్న పలు సర్వేల్లోనూ ఈ మేరకు స్పష్టమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కీలకమైన ఉద్యోగలను దూరం చేసుకోవడం ఇష్టం లేక, వారిని సంతృప్తి పరిచేందుకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా నివేదిక వచ్చి అమలు చేసే వరకు 5% ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ వదిలిన బ్రహ్మస్త్రం పీఆర్‌సీ అని గులాబీ పార్టీ సానుకూల వర్గాలు పేర్కొంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates