కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇదంతా తమ క్రెడిట్ అని చాటి చెప్పుకొనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. దీనికి కారణంలో బిల్లులోని సాంకేతిక అంశాలే. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు తీరును గమనిస్తే.. వచ్చే ఎన్నికలలో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవు అని స్పష్టం అవుతోంది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతిక అంశాలను కేంద్రం పరిష్కరించకపోతే పదేళ్ల వరకు రిజర్వేషన్ల అమలు జరిగే చాన్స్ లేదంటున్నారు.
ప్రస్తుతం ప్రస్తావించిన బిల్లులో కీలకమైన అంశాలు నియోజకవర్గాల పునర్విభజన, జనాభ గణన. 2002 లో చేసిన 82 వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాతనే డీ-లిమిటేషన్ జరుగుతుంది. 2031 లో జనాభా గణన ఉంటుంది. ఈ రెండు రకాల ప్రక్రియలు పూర్తి అయిన తర్వాతనే మహిళా బిల్లు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూలు ప్రకారం 2021లోనే జనగణన ప్ర్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. డిజిటల్ పద్ధతిలోనే జనాభా లెక్కల సేకరణ జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినా 2031లో సెన్సెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ లెక్కల ప్రక్రియ పూర్తయ్యి దాని ఆధారంగా డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్ ఖరారు కానుందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు ప్రక్రియ స్పష్టం చేస్తోంది.
అంటే, ప్రస్తుత బిల్లు ప్రకారం 2031లో జన గణన పూర్తయిన తర్వాత అంటే.. మరో పదేళ్ల పాటు మహిళా బిల్లు అంశం కొనసాగుతుంది. ఆ తరువాత పార్లమెంటులో మళ్ళీ చట్టం చేస్తేనే మహిళా బిల్లు సాధ్యం అవుతుంది. ఒకవేళ, ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు ఆచరణలోకి రావాలంటే రాజ్యాంగానికి సవరణలు (ఆర్టికల్ 230-ఏఏ, 230ఏ, 232ఏ, 334) జరగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికీ సవరణలు అనివార్యం అని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates