తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొంతకాలంగా మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తో బండి సంజయ్ కు విభేదాలున్నాయని, పార్టీ అధ్యక్ష పదవి కోసం ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వస్తోంది. ఈ రోజు జరగబోతున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో బండి సంజయ్ కు ఛాన్స్ ఇచ్చి తెలంగాణ బీజేపీ పగ్గాలను ఈటల రాజేందర్ కు గాని, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి గాని అప్పగించాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 8న వరంగల్ లో జరగబోతున్న ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సభా స్థలిలో ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన బండి సంజయ్ తన అనుచరులతో సంచలన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లా హన్మకొండలో పర్యటించిన బండి సంజయ్ ముభావంగా ఉండడంతో ఆయనను అనుచరులు సముదాయించారట. మోడీ సభ సమయానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తాను హాజరవుతానో లేదో అని తన సన్నిహితులు, కార్యకర్తల దగ్గర ఆయన వాపోయినట్టుగా తెలుస్తోంది.
సాధారణంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే బండి సంజయ్…కొద్ది రోజులుగా ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డితో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ సైలెంట్ గా ఉండటంపై పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. బండి సంజయ్ ని తప్పించడం ఖాయమని, ఆ స్థానంలో కిషన్ రెడ్డి లేదా ఈటల రాజేందర్ కు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాతే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని ఆయన అనుచరులు అంటున్నారు. తాజాగా బండి సంజయ్ మౌనాన్ని బట్టి ఆయనకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.