బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు కనీసం మాట మాత్రంగా కూడా ఆయన ఈ పర్యటనకు సంబంధించి ఏమీ చెప్పకుండా వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులుగా బండి సంజయ్ ఢిల్లీలో ఏం చేస్తున్నారనే ప్రశ్న తెలంగాణ బీజేపీ నేతల మధ్య చక్కర్లు కొడుతోంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా పార్టీ అగ్ర నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు. అయితే.. సంజయ్ స్వయంగా వెళ్లారని.. కొందరు చెబుతుంటే, కాదు, పార్టీ అధిష్టానమే ఆయనను పిలిచిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం అధ్యక్ష మార్పు అనివార్యమనే సంకేతాలు తరచుగా వస్తున్నాయి. మరో ఐదారుమాసాల్లోనే ఇక్కడ ఎన్నికలు ఉండడంతోపాటు.. బలమైన కేసీఆర్ను ఢీ కొట్టాలంటే అంతే బలంగా వ్యవహరించాలని పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మరోవైపు.. పార్టీ వర్గాల కథనం మేరకు తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అగ్ర నేతలకు బండి వివరించినట్లు తెలుస్తోంది.
పార్టీలో నెలకొన్న స్తబ్దత, చేరికలపై చర్చించినట్లుగా సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితి నుంచి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు అగ్ర నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ నెల 25న రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అదేసమయంలో అమిత్ షాతో బహిరంగ సభను ఈ నెల చివరి వారంలో నిర్వహించే విషయంలో చర్చించేందుకు వెళ్లారని బీజేపీ నాయకులు తెలిపారు.
దీంతో పాటు ప్రధాని మోడీ విదేశీ పర్యటన అనంతరం.. రాష్ట్రంలో పర్యటించే అంశంపై అగ్ర నేతలతో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహా జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమాలు, సభలు సమావేశాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో మోడీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి అయినందున ఈ నెల 22న ప్రతి నాయకుడు తమ నియోజక వర్గాల్లోని ప్రజలను కలవనున్నారు. దీనిపైనా బండి సంజయ్ పార్టీ అధిష్టానానికి వివరించినట్టు తెలుస్తోంది.