ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం

కేరళలోని కోజికోడ్ లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వే పై స్కిడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానం ఏకంగా రెండు ముక్కలైపోయింది. ఈ ప్రమాదం విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించగా… విమానంలోని చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెనువెంటనే స్పందించిన కారిపూర్ ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… 184 మంది ప్రయాణికులతో ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్-1344 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ కు బయలుదేరింది. శుక్రవారం రాత్రి సరిగ్గా 7.45 గంటలకు కోజికోడ్ లోని కారిపూర్ ఎయిర్ పోర్టుకు ఈ విమానం చేరింది. ప్రయాణమంతా సాఫీగా సాగిన నేపథ్యంలో విమానం ల్యాండ్ కాగానే… ప్రయాణికులంతా విమానం దిగేసి ఇళ్లకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎయిర్ పోర్టు రన్ వే పైకి వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వేపై ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. ఊహించని ఈ పరిణామంతో విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా విమానం ఏకంగా రెండు ముక్కలుగా విడిపోయింది. మొత్తంగా ఈ ప్రమాదం భారీ ప్రమాదంగానే పరిగణించక తప్పదు.

ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బందితో కలిసి మొత్తం 190 మంది ఉన్నట్లుగా ఎయిరిండియా తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది రెండు భాగాలుగా విడిపోయిన విమానంలో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసే పనిని మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో విమానంలోని చాలా మంది తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విమాన శకలాల నుంచి ప్రయాణికులను బయటకు తీసిన సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.